హైదరాబాద్ చందానగర్ ఠాణా పరిధిలో నివాసముండే బాధితురాలు(48) స్థానికంగా వ్యాపారం చేస్తుంటారు. లావాదేవీల కోసం ఓ ప్రముఖ బ్యాంక్‌లో కరెంట్ ఖాతాను నిర్వహిస్తున్నారు. ఈనెల 1న చాలాసేపు ఫోన్‌కు ‘సిగ్నల్స్’ రావడం లేదని గుర్తించారు. ఎయిర్‌టెల్ కస్టమర్ కేర్‌కి మరో నంబర్ నుంచి కాల్ చేయగా.. ఆ సిమ్ కార్డు బ్లాక్ అయినట్లు తెలిసింది. మరుసటి రోజు ఉదయం దగ్గర్లోని ఎయిర్‌టెల్ స్టోర్‌కు బంధువును పంపించారు. ఆ సిమ్‌ను అన్‌లాక్ చేసేందుకు 4 నుంచి 5 గంటలు పడుతుందని సిబ్బంది చెప్పారు. అదేరోజు రాత్రి 8 గంటల సమయంలో సిమ్ కార్డు పనిచేయడం మొదలయ్యింది. సిగ్నల్ రావడమే ఆలస్యం.. కరెంట్ ఖాతా నుంచి పలు దఫాలుగా రూ.24.14 లక్షలు డెబిట్ అయినట్లు ఎస్‌ఎంఎస్ రావడంతో కంగుతిని పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి..
సిమ్ పనిచేయడం లేదని గుర్తించినప్పుడే బాధితురాలు బ్యాంక్ అధికారులను అప్రమత్తం చేసి ఉంటే ఒక్క రూపాయి కూడా పోకుండా ఉండేదని పోలీసులు తేల్చారు. ఫిషింగ్, స్మిషింగ్, విషింగ్ తదితర రూపాల్లో ఎస్‌ఎంఎస్‌ల్లో లింక్‌ను పంపి లేదా బ్యాంక్ అధికారుల్లా మాట్లాడి వ్యక్తిగత సమాచారం తీసుకున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. లేదా ఎస్‌ఎంఎస్ రూపంలో మాల్‌వేర్ వైరస్‌ను పంపించి ఉంటారని భావిస్తున్నారు. అది క్లిక్ చేయగానే ఫోన్ వాళ్ల కంట్రోల్లోకి వెళ్లిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ‘ఆ సమాచారంతో నకిలీ ధ్రువపత్రాలను సృష్టిస్తున్నారు. ఒక్క ఫొటో మినహా వివరాలన్నీ బాధితులవే ఉంటాయి. ప్రస్తుతమున్న సిమ్‌ను బ్లాక్ చేయిస్తున్నారు. కొత్త సిమ్‌ను తీసుకుంటున్నారు. బ్యాంక్ నుంచి వచ్చే ఓటీపీలు అదే నంబర్‌కు వస్తుంది. దీంతో ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు డబ్బులు పంపిస్తున్నారు. ఈ కేసులో ఇలాగే జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నాం’ అని సంబంధిత పోలీస్ ఉన్నతాధికారి పేర్కొన్నారు.