Video Call morphing and cheating: నగరంలో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడం కష్టతరంగా మారింది. నేరగాళ్లు రోజుకో కొత్త పంథాను అనుసరిస్తూ అమాయకులను నిలువుదోపిడీ చేస్తున్నారు. అప్రమత్తమై తప్పించుకున్నామా ఆ ఉచ్చు నుంచి బయటపడినట్లే.. పొరపాటున వారి చేతికి చిక్కామో ఇక ఉన్నది మొత్తం ఊడ్చేవరకూ వదిలిపెట్టరు. వారి బెదిరింపులకు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేస్తేనే ఈ సమస్య నుంచి బయటపడతారు. కానీ ఎక్కడ పరువు పోతుందనో భయంతో వెనకడుగు వేస్తున్నారు. వారు అడిగినంతా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇక వల్ల కాదని తెలిసి చివరికి పోలీసులను సంప్రదిస్తున్నారు.
వీడియో మార్ఫింగ్:సంగీత దర్శకుడి చరవాణికి వీడియో పంపి, అనంతరం అతని ముఖాన్ని మరొకరి ముఖంతో మార్ఫింగ్ చేసి డబ్బుల కోసం వేధిస్తున్న ఘటన ఇది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణానగర్‌లో నివసించే సంగీతదర్శకుడు సరోలి రాజీవ్ ఎబ్నేజర్‌కు గతేడాది అక్టోబరు 22న ఫేస్‌బుక్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తి పరిచయమై ఫోన్ నంబరు తీసుకున్నాడు. అనంతరం సరోలికి ఓ వీడియోకాల్ వచ్చింది, అందులో నగ్నంగా ఓ మహిళ ప్రత్యక్షమైంది. అనంతరం అవతలి వ్యక్తి మరొకరి శరీరానికి సరోలి ముఖాన్ని మార్ఫింగ్ చేసి, ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేశాడు. ఆ వీడియోలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపిస్తానంటూ బెదిరించి డబ్బు డిమాండ్ చేశాడు. సరోలి కొంత మొత్తం చెల్లించినా బెదిరింపులు ఆగకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.