Cricket Betting: తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ బెట్టింగ్‌లు బెంబేలెత్తిస్తున్నాయి. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన స్థిరాస్తి వ్యాపారి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. రాజకీయ పార్టీలతో సంబంధాలు కొనసాగిస్తూ.. పరిచయాలు పెంచుకున్నాడు. ఎన్నికలు, పండుగలు, క్రీడలు ఏవైనా భారీఎత్తున పందేలు నిర్వహిస్తున్నాడు. 2012-2022 మధ్య పలుమార్లు అరెస్టయి జైలుకెళ్లొచ్చినా పద్ధతి మార్చుకోలేదు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లోని సంపన్నవర్గాలు.. వ్యాపారులను సభ్యులుగా చేసుకుని ఐపీఎల్ 2022 మ్యాచ్‌లతో రోజూ ఒకటి నుంచి 2 కోట్ల రూపాయల మేర పందేలు కాయిస్తున్నాడు. ఏ జట్టు ఓడినా, గెలిచినా ప్రధాన బుకీగా ఇతడికి 10 నుంచి 15శాతం కమీషన్ వస్తోంది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో... 20 నుంచి 30 మంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వారికి 2 నుంచి 3శాతం కమీషన్ ఇస్తున్నట్టు రాచకొండ పోలీసులు గుర్తించారు. గ్రేటర్ అడ్డాగా ఐపీఎల్ 2022 క్రికెట్ మ్యాచ్‌ల పందేలు కోట్లల్లో జరుగుతున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 10 రోజుల వ్యవధిలోనే.. క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై దాడులు నిర్వహించి 4 కోట్ల రూపాయల మేర సొత్తు స్వాధీనం చేసుకున్నారు. 30 మంది నిందితులను అరెస్టు చేశారు.
బానిసలవుతున్న విద్యార్థులు:బెట్టింగ్ యాప్‌ల్లో రిజిస్ట్రేషన్ అయిన ప్రధాన బుకీలు.. వాటిని సబ్ బుకీలు, ఏజెంట్లకు అప్పగించి తెర వెనుక నుంచి వ్యవహారం నడిపిస్తున్నారు. ఏపీ, తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ ప్రాంతాలకు చెందిన వ్యాపారుల కనుసన్నల్లోనే.. నగరంలో ప్రతిరోజూ 30 నుంచి 40 కోట్ల రూపాయల మేర పందేలు నిర్వహిస్తున్నట్టు పోలీసువర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో క్రికెట్ బెట్టింగ్ కేసుల్లో అరెస్టయిన ప్రధాన నిందితులే... ప్రస్తుతం నగరంలో అపార్ట్‌మెంట్స్, ఫామ్‌హౌస్‌లు, లాడ్జీల్లో గదులను అద్దెకు తీసుకుని పందేలు నిర్వహిస్తున్నట్టు సైబరాబాద్‌కు చెందిన పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఐటీ నిపుణులు, కార్పొరేట్ ఉద్యోగులు, విద్యార్థులు సరదాగా పందేలు కాస్తూ క్రమంగా బానిసలవుతున్నారు. బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లు అందుబాటులోకి రావటంతో ప్రధాన బుకీలు, ఫంటర్లు ఎవరనేది గుర్తించటం సవాల్‌గా మారింది. ఇదే అదనుగా యాప్‌లో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన బుకీలు వాటిని ఇతరులకు అప్పగించి తెరవెనుక నుంచి వ్యవహారాలను చక్కబెడుతున్నారు.