Drugs seize: విమానాశ్రయాల్లో డ్రగ్స్ భారీగా పట్టుబడుతోందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. హైదాబాద్‌లో ఇవాళ పట్టుబడిన డ్రగ్స్ కేసు వివరాలను ఆయన వెల్లడించారు. మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న నలుగురు విదేశీయులను నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 110 గ్రాముల మెథాంఫిటమైన్, 20గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా నైజీరియా, టాంజానియా, యెమన్ దేశస్తులుగా గుర్తించారు.
దిల్లీ కేంద్రంగా కొకైన్ సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నామని సీపీ ఆనంద్ తెలిపారు. ఈ కేసులో నైజీరియన్ ఉమేబ్యునై ప్రధాన నిందితుడని వెల్లడించారు. ఇటీవల విమానాశ్రయంలో పట్టుబడిన డ్రగ్స్‌తో ఉమేబ్యునేకు సంబంధముందని స్పష్టం చేశారు. యాంబీ చివోడి అనే మరో నిందితుడు బెంగళూర్‌లో పట్టుబడినట్లు పేర్కొన్నారు. యాంబీ చివోడి పాస్‌పోర్ట్ కూడా సీజ్ అయిందని.. ఇన్‌స్టాగ్రామ్‌లో రహస్య కోడ్ భాషలో కొకైన్ సరఫరా చేస్తున్నట్లు సీపీ తెలిపారు.
విమానాశ్రయాల్లో డ్రగ్స్ భారీగా పట్టుబడుతోంది. హైదరాబాద్‌లో ఆఫ్రికన్లకు నెట్‌వర్క్ ఉంది. దుండగుడి పాస్‌పోర్టును అధికారులు సీజ్ చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా డ్రగ్స్ సమాచారం చేరవేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో రహస్య కోడ్‌ల ద్వారా డ్రగ్స్ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. నకిలీ ఐడీ కార్డుల ద్వారా డ్రగ్స్ వ్యవహారాన్ని నడుపుతున్నారు. హైదరాబాద్‌లో ఉన్నవారికి డ్రగ్స్ విక్రయిస్తున్నారు.
- సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
చివోడి, ఉమేబ్యునైకు డివైన్ ఎబుకా సుజీ అనే వ్యక్తితో సంబంధాలున్నట్లు గుర్తించామని సీవీ ఆనంద్ వెల్లడించారు. ఎబుకా సుజీకి అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరాదారులతో సంబంధముందని. అయితే ప్రస్తుతం ఎబుకా సుజీ పరారీలో ఉన్నట్లు తెలిపారు. డ్రగ్స్ కొనుగోలు చేసిన 17మంది కోసం గాలిస్తున్నట్లు సీవీ ఆనంద్ పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చే సరుకును ఎవరు తీసుకుంటున్నారనే దానిపై ఆరా తీస్తున్నట్లు వివరించారు. నకిలీ పాస్‌పోర్టులతో దుండగులు హైదరాబాద్‌లో తిరుగుతున్నారని సీపీ వెల్లడించారు. ముఠాలు తయారు చేసి ఏటీఎం కార్డుల స్వీపింగ్ ద్వారా దందాలు చేస్తున్నారని తెలిపారు. యేమెన్ దేశస్తుడు ఒక యాప్‌లో ఛాటింగ్ చేస్తూ దందాకు పాల్పడుతున్నాడని సీపీ వివరించారు. రూ.2 లక్షల విలువ చేసే 20 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు.