Vijayawada Rape Case : ఏపీలోని విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఘటనపై పోలీసుల చర్యలు చేపట్టారు. మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటనలో ఇద్దరు పోలీసులపై సీపీ కాంతి రాణా టాటా వేటు వేశారు. విధుల్లో అలసత్వం వహించినందుకు గాను సీఐ హనీశ్, సెక్టార్ ఎస్‌ఐ శ్రీనివాస రావులను సస్పెండ్ చేశారు. కుమార్తె కనిపించలేదన్న తల్లిదండ్రుల ఫిర్యాదును పట్టించుకోకపోవడంపై ఈ చర్యలు తీసుకున్నారు.
విజయవాడ రేప్ కేసు.. నున్న సీఐ, ఎస్ఐలు సస్పెండ్ - విజయవాడ రేప్ కేసు అప్‌డేట్స్
Vijayawada Rape Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ మానసిక వికలాంగురాలి అత్యాచార ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించి.. విధుల్లో అలసత్వం చూపిన సీఐ హనీశ్, సెక్టార్ ఎస్‌ఐ శ్రీనివాసరావులను సస్పెండ్ చేస్తూ సీపీ కాంతి రాణా ఆదేశాలు జారీ చేశారు.
అసలేం జరిగిందంటే..నిత్యం జనంతో రద్దీగా ఉండే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యంత హేయమైన ఘటన చోటు చేసుకుంది. మానసిక వికలాంగురాలైన ఓ యువతి (23)పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు 30 గంటలపాటు ఆమె పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. ఓ ఇరుకు గదిలో బంధించి దాడికి పాల్పడ్డారు. అప్పటి వరకూ ఇంటి వద్దనున్న తమ కుమార్తె కనిపించట్లేదంటూ బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటానికి వెళ్లగా.. స్పందించకుండా సాయంత్రం రావాలంటూ తిప్పి పంపించేశారు. చివరిసారిగా ఫలానా నంబర్ నుంచి ఫోన్ వచ్చిందని ఆధారమిచ్చినా సరే వెంటనే చర్యలు చేపట్టలేదు.