Chits Fraud in phirangipuram: అమాయకులకు చిట్టీల పేరుతో వల విసిరి వారి నుంచి రూ.7 కోట్ల వరకూ దండుకున్నారు ఘరానా దంపతులు. చిరు వ్యాపారం చేస్తూ ఇరుగుపొరుగును మచ్చిక చేసుకుంటూ వారికి మాయమాటలు చెప్పారు. తమ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి సైతం పెద్ద ఎత్తున డబ్బులు కట్టించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని పొనుగుపాడు గ్రామంలో ఈ ఘరానా మోసం జరిగింది.
విహార యాత్రలకు వెళ్తున్నామని
నిడమనూరి భీమేశ్వరావు, సుబ్బాయమ్మ దంపతులు పొనుగుపాడులో చిల్లర, వస్త్ర, మెడికల్ దుకాణం నడుపుతున్నారు. కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. గ్రామస్థులు కొందరు రూ.3 కోట్లు దాకా వారి వద్ద చిట్టీలు కట్టారు. వీరితో పాటు గ్రామం చుట్టుపక్కల ఉన్న నరసరావుపేట, గుంటూరు నగరానికి చెందిన కొందరు రూ.4 కోట్ల వరకు చిట్టీలకు సొమ్ము చెల్లించారు. అయితే.. భీమేశ్వరావు కుటుంబసభ్యులు రెండ్రోజుల క్రితం ఇంటికి తాళం వేసి బయటకు వెళుతున్నారు. ఆ సమయంలో వారిని గమనించిన స్థానికులు ఎక్కడికి వెళుతున్నారని ప్రశ్నించారు. దీంతో వారు విహారయాత్రకు వెళుతున్నట్లు తెలిపారు. వారి తీరుపై అనుమానం వ్యక్తం చేసిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
Chits fraud:ఉద్దేశ్యపూర్వకంగానే వారు గ్రామం నుంచి వెళ్లిపోయారని ఆరోపిస్తూ.. బాధితులు ఫిరంగిపురం పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై అజయ్‌బాబు తన సిబ్బందితో కలిసి సాయంత్రం గ్రామానికి వెళ్లి విచారించారు. ఇంటి అవసరాలకు ఉపయోగపడతాయని దాచుకున్న సొమ్ము.. చిట్టీల పేరుతో భీమేశ్వరావు కుటుంబానికి కట్టామని.. ఇలా జరుగుతుందని ఊహించలేదని గ్రామస్థులు లబోదిబోమంటున్నారు.
ఇదీ చదవండి:Loan apps case: లోన్ యాప్‌ల కేసులో చార్టెర్డ్ అకౌంటెంట్‌ను అరెస్ట్ చేసిన ఈడీ