మారుమూల గ్రామం... రోజు కూలీ పని చేసుకుంటే తప్ప పూట గడవని పరిస్థితి. ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నా... కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రుల కోరిక. చిన్ననాటి నుంచి ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉండగా.. కుమారుడికి క్యాన్సర్ వ్యాధి రావడంతో కుటుంబానికి పెద్ద కష్టమొచ్చింది.
మంచం పట్టిన కుమారుడు... సాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు
ఆడిపాడాల్సిన వయసులో ఆ చిన్నోడికి పెద్ద కష్టం వచ్చింది. తోటి పిల్లలతో సరదాగా గడపాల్సిన వయసులో కంటి క్యాన్సర్ వ్యాధి మహమ్మారిలా వెంటాడుతోంది. కొడుకు వైద్యానికి లక్షలు ధారపోసినా నయం కాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం సూరారం గ్రామంలో కండెల ధర్మక్క, బాపు దంపతులు. కూలీ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. వారి కుమారుడు శివతేజ ఉల్లాసంగా ఉత్సహంగా తిరిగేవాడు. ఓ రోజు అనారోగ్యంతో బాధపడుతుండగా పట్టణ ఆసుపత్రిలో చూపించారు. కంటికి క్యాన్సర్ వ్యాధి వచ్చినట్లు వైద్యులు నిర్ధరించారు. వారి స్తోమతకు మించి వైద్యం అందించారు. ప్రస్తుతం చేతిలో డబ్బులు లేక... కుమారుడిని ఎలా కాపాడుకోవాలో అర్థంకాక... తల్లిదండ్రుల బాధ వర్ణతీతం.
మెరుగైన వైద్యం, కనీస రవాణా ఖర్చులుకు సైతం డబ్బులు లేకపోవడం వల్ల నానా కష్టాలు పడుతున్నారు. చేసేదేమి లేక... ఎవరికి చెప్పుకోలేక వారి బాధ వారే అనుభవిస్తూ.. అనారోగ్యంతో మంచం పట్టిన కుమారుడి బాధను దిగమింగుతూ... కుమారుడిని చూసుకుంటున్నారు. ఈ విషయం తెలియడంతో అదే గ్రామానికి చెందిన సూరం మహేష్ అనే వ్యక్తి రెండు వేల రూపాయలు అందించారు. ఎవరైన తమ కుటుంబానికి సహాయం చేయాలని... వారు కోరుకుంటున్నారు.