Child Kidnap Drama: ఏదో అనుకుంటే ఇంకేదో అయింది.. బంధువుల్లో హీరోయిజం చూపాలని.. కిడ్నాప్ డ్రామా నడిపించిన యువకుడు, సహకరించిన స్నేహితులు జైలుపాలయ్యారు. గురువారం సికింద్రాబాద్‌లో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ ఉదంతం కలకలం సృష్టించింది. పోలీసులను ఉరుకులుపరుగులు పెట్టించింది. రాత్రి జీడిమెట్లలో చిన్నారి కనిపించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గోపాలపురం ఇన్‌స్పెక్టర్ సాయిఈశ్వర్‌గౌడ్ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.
గతంలోనూ విఫలయత్నం..సీతాఫల్‌మండికి చెందిన సిరివెల్లు సాయిరాం(25) అక్వేరియం వ్యాపారి. రెజిమెంటల్‌బజార్‌లో అతనికి వరసకు సోదరి అయ్యే ఉమ, ఆమె భర్త శ్రీనివాస్ వారి పిల్లలు తరుణ్(6), కీర్తన(3) ఉంటున్నారు. ఆ కుటుంబం మెప్పు పొంది దగ్గర కావాలని సాయిరాం ప్రయత్నించేవాడు. ఇందుకు తరుణ్‌ను కిడ్నాప్ చేసి, తానే వెతికి అప్పగించినట్టు చూపాలనే పథకం వేశాడు. ఈనెల 21న బాలుడి పాఠశాల వద్దకు స్నేహితులను పంపాడు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు ఫోన్ చేయగా.. భయపడిన తల్లి తానే పిల్లవాడిని తీసుకెళ్తానంటూ చెప్పడంతో పథకం బెడిసికొట్టింది. దీంతో సాయిరాం మరో ఎత్తు వేశాడు. గురువారం కీర్తన ఇంటినుంచి బయటికొచ్చి అడుకుంటున్నపుడు మైనర్ అయిన తన సోదరుడు, అతడి స్నేహితుడితో కిడ్నాప్ చేయించాడు. వారిని చింతల్‌లో ఉండమని చెప్పాడు. బిడ్డ కనిపించక వెతుకుతున్న తల్లి ఉమకు, ఇద్దరు యువకులు చిన్నారిని తీసుకెళ్లారని ఒక మహిళ చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు వెంటనే టాస్క్‌ఫోర్స్ బృందాలతో రంగంలోకి దిగారు. చిన్నారిని కిడ్నాప్ చేసింది మేనమామేనని గుర్తించారు. చింతల్‌లో ఉన్న సాయిరాం స్నేహితుడు నితిన్‌కుమార్ ఇంట్లో వెతకగా చిన్నారి కనిపించింది. గురువారం రాత్రి ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు.