Cheating in the Name of Mudra Society Chits: వరంగల్ జిల్లా పర్వతగిరిలో ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉండేవారిని ఉద్యోగులుగా నియమించుకున్నారు. సంస్థలో నియమించుకున్న వారి నుంచి సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో రూ.లక్షన్నర వసూలు చేశారు. ఈ ముద్రా సొసైటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనుబంధంగా పని చేస్తుందని నమ్మించిన నిర్వాహకులు.. స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులతో.. ఆర్భాటంగా కార్యాలయాన్ని ప్రారంభించి జనాన్ని ఆకర్షించారు.
చిన్న మొత్తాల్లో పొదుపు చేస్తే అధిక లాభాలుంటాయని ప్రజలను నమ్మించారు. వ్యాపారాలకు రుణాలిస్తామని ప్రకటనలు చేశారు. మండలంలోని 33 గ్రామాలకు చెందిన 640 మంది వద్ద రోజువారీ చిట్టీల రూపంలో రూ.లక్షల్లో వసూలు చేశారు. ఈ మొత్తం దాదాపు రూ.70 లక్షల నుంచి రూ.కోటి ఉంటుందని స్థానికులు తెలిపారు. మొదటి ఏడాదిలో పొదుపు చేసుకున్న డబ్బులను వడ్డీతో సహా ఇచ్చి అక్కడి జనాలను నమ్మించిన నిర్వాహకులు.. పెద్ద మొత్తంలో డబ్బులు జమ అయ్యాక కార్యాలయానికి తాళాలు వేసి పరారయ్యారు.