Chain snatching cctv video: ఓ మహిళను ఫాలో అయిన దుండగుడు అపార్ట్మెంట్ లోనికి వచ్చి బంగారు గొలుసు చోరీకి పాల్పడిన సంఘటన హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేపీహెచ్బీ కాలనీ రోడ్ నంబర్ 2 లోని ఓ అపార్ట్మెంట్లో నివసించే పద్మజారెడ్డి.. నిన్న రాత్రి 8 గంటల సమయంలో కిరాణా దుకాణానికి వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమెను ద్విచక్ర వాహనంపై వెంబడించాడు. అలా వారు నివసించే అపార్ట్మెంట్ వరకూ వచ్చిన దుండగుడిని గమనించిన పద్మజారెడ్డి.. అతడిని ఎవరు కావాలని అడిగారు. తాను సత్యనారాయణ అనే వ్యక్తి కోసం వచ్చినట్లు తెలిపాడు. ఆ పేరుతో ఎవరూ లేరని పద్మజారెడ్డి చెప్పగా.. ఫోన్ కలవటం లేదని మాట్లాడుతూ భవనం లోపలే తచ్చాడాడు.
లిఫ్ట్ కోసం నిలబడితే
ఈ క్రమంలో లిఫ్ట్ వద్ద నిలబడిన ఆమె మెడలో నుంచి నాలుగు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. దుండగుడిని నిలువరించే ప్రయత్నంలో తాను కిందపడిపోయానని.. లేచి వెళ్లి చూసే సరికి ద్విచక్ర వాహనంపై పారిపోయాడని బాధితురాలు తెలిపారు.
నిన్న రాత్రి నేను సమీపంలోని కిరాణా దుకాణానికి వెళ్లి వస్తుండగా.. ఒకతను నన్ను వెంబడించాడు. ఎవరు మీరని ఆరా తీస్తే.. సత్యనారాయణ కోసం వచ్చానని తెలిపాడు. ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరని చెబితే.. పక్కకు వెళ్లి మళ్లీ లోపలికి వచ్చాడు. ఆయనకు ఫోన్ చేస్తే కలవడం లేదు.. ఇక్కడే ఉంటారు అని దుండగుడు చెప్పాడు. నేను ఫోన్ చేస్తాను.. నెంబరు ఇవ్వండి అని లిఫ్ట్ వద్దకు వెళ్తుంటే అకస్మాత్తుగా నా మెడలో నుంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు. తేరుకునేలోపు అక్కడి నుంచి పారిపోయాడు. -- పద్మజారెడ్డి, బాధితురాలు