'అమ్మా.. హనుమాన్ టెంపుల్ ఎక్కడ' అని అడిగాడు. ఇటువైపు ఒకటి, అటువైపు ఒకటి ఉందని ఆ వృద్ధురాలు సమాధానం చెప్తుండగానే.. మెడలో ఉన్న బంగారు గొలుసు తెంచుకుని బైకుపై ఉడాయించారు దుండగులు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
'ఆలయానికి దారి అడిగాడు.. బంగారం లాక్కెళ్లాడు'
మహిళలూ తస్మాత్ జాగ్రత్త. గొలుసు దొంగలు ఎప్పటికప్పుడు తమ పంథా మార్చుకుంటున్నారు. కొత్తదారులు వెతుక్కుని కాచుకు కూర్చుంటారు. మెరుపువేగంతో వచ్చి బంగారం లాక్కెళ్లిపోతారు. బంగారం కొనుక్కోవడానికి ఎంతో కష్టపడి ఉంటారు. దాన్ని కాపాడుకోవడంలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు. కామారెడ్డి పట్టణ కేంద్రంలో పొద్దుపొద్దున్నే ఇంటిముందు పూలు కోస్తున్న బామ్మ దగ్గరికి వచ్చిన దుండగులు హనుమాన్ టెంపుల్కి దారి అడిగినట్టు నటించి.. మెడలో గొలుసుతో ఉడాయించారు.
పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉండే వరలక్ష్మి(60).. ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో పూజ కోసం ఇంటిముందు ఉన్న చెట్టు పూలు తెంచుతోంది. కాసింత దూరంలో ఓ బైకుపై ఉన్న ముగ్గురిలో ఒకరు ఆమె వద్దకు వచ్చారు. అడ్రస్ అడిగినట్టు నటించి.. మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసు అపహరించారు. వెంటనే తేరుకున్న వృద్ధురాలు అరిచేలోపు ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కాలనీకి చేరుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి:భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య