Hyderabad Chain Snatcher Arrest :హైదరాబాద్‌లో వరుస గొలుసు దొంగతనాలతో అలజడి సృష్టించిన నిందితుడు ఉమేశ్ ఖతిక్(26) పోలీసులకు చిక్కాడు. బుధవారం(జనవరి 19) హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలోని ఐదు ప్రాంతాల్లో ఒంటరి మహిళలే లక్ష్యంగా గొలుసు చోరీలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలతో అప్రమత్తమైన మూడు కమిషనరేట్ల పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు ముమ్మర గాలింపు చేపట్టారు.
ఎలా దొరికాడంటే..
చివరిగా గొలుసు దొంగతనం జరిగిన మేడిపల్లి ఠాణా సమీపంలోని హోటల్ వద్ద నిందితుడు ఉపయోగించిన స్కూటీని గుర్తించారు. సమీపంలోనే టోపీ, జర్కిన్ లభించాయి. నగరవ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ సేకరించిన పోలీసులు.. నిందితుడి వీడియోలను సేకరించారు. నిందితుడు సెల్‌పోన్ వాడటం వల్ల ఆయా టవర్ల వద్ద సమాచారం అంచనా వేసుకుంటూ విచారణ వేగవంతం చేశారు. ఆరు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితుని ఫోన్ ఒక్కచోట మాత్రం పనిచేయలేదని గుర్తించటంతో.. ఓ స్పష్టతకు రాగలిగారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఆసిఫ్‌నగర్‌లో స్కూటీ చోరీ, నాంపల్లిలోని హోటల్‌లో దిగటం, వరుసగా గొలుసు దొంగతనాలు చేసిన వ్యక్తి ఉమేష్ ఖతిక్ అనే నిర్ధరణకు వచ్చారు.
పట్టించిన ఆధార్ కార్డు..
గొలుసుదొంగ ఉమేష్ ఖతిక్‌ను ఇటీవల అహ్మదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్‌కు తరలిస్తున్న సమయంలో పోలీసుల కన్నుగప్పి తప్పించుకుని హైదరాబాద్‌కు వచ్చాడు. నాంపల్లి వద్ద హోటల్‌లో దిగేటపుడు అసలు ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్లు ఇచ్చేశాడు. నిందితుడు ఉమేష్ ఖతిక్ అని నిర్ధరణకు రాగానే.. హోటల్ మేనేజర్ నుంచి సీసీ ఫుటేజ్, ఆధార్‌కార్డు, ఫోన్‌నంబర్లు సేకరించటంతో నిందితుడిని గుర్తించటం సులువైంది.