Gudivada Issue: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడ తెదేపా కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా గుడివాడలోని కొడాలి కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహించారనే అంశంపై తెదేపా నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సభ్యులుగా ఉన్న తెదేపా సీనియర్ నేతలు నక్కా ఆనందబాబు, బొండా ఉమా, వర్ల రామయ్య, ఆలపాటి రాజా తదితరులు క్యాసినో నిర్వహించిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు గుడివాడ చేరుకున్నారు.
తొలుత తెదేపా కార్యాలయానికి చేరుకున్న నేతలు.. అక్కడి నుంచి క్యాసినో నిర్వహించిన ప్రాంతానికి బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. కన్వెన్షన్ సెంటర్ పరిశీలనకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో తెదేపా నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిజనిర్థరణకు వెళ్లిన తెలుగుదేశం నేతలు వెనక్కి వెళ్లాలంటూ.. వైకాపా శ్రేణులూ పోటీగా రోడ్డెక్కడం ఉద్రిక్తతకు దారితీసింది. గుడివాడ పార్టీ కార్యాలయం నుంచి కె-కన్వెన్షన్‌కు బయల్దేరిన నేతలను.. నెహ్రూ చౌక్ వద్ద పోలీసులు అడ్డుకోగా.. ఆ పక్క వీధిలో వైకాపా శ్రేణులు అడ్డుకుని రోడ్డుపై బైఠాయించాయి. ఇరువర్గాల మోహరింపుతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బలవంతంగా తెదేపా బృందాన్ని వాహనాల్లో ఎక్కించి అక్కడ నుంచి తరలించారు.
నినాదాలు చేసి.. రాళ్లు రువ్వి..
తెలుగుదేశం నాయకుల అరెస్టు తర్వాత.. వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. బొండా ఉమ కారు అద్దాన్ని పగలగొట్టారు. గుడివాడ పార్టీ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. తెదేపాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రాళ్లు రువ్వారు. వైకాపా శ్రేణులను పోలీసులు కనీసం నిలువరించలేదని తెదేపా నేతలు మండిపడ్డారు.