ఓ వర్గం మహిళల ఫొటోలను ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టిన నిందితులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఉమెన్ అండ్ ట్రాన్స్‌జెండర్ ఆర్గనైజేషన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (డబ్ల్యూ.టి.ఒ.జె.ఎ.సి.) ప్రతినిధులు డిమాండు చేశారు. ‘బుల్లిబాయి’ పేరుతో వెబ్‌సైట్ ఏర్పాటు చేసి ఓ వర్గానికి చెందిన మహిళ ఫొటోను వేలానికి పెట్టిన వారిని తక్షణమే గుర్తించాలన్నారు. ఈ మేరకు కమిటీ ప్రతినిధులు మంగళవారం రాష్ట్ర మహిళా కమిషన్, రాష్ట్ర మానవహక్కుల కమిషన్, సైబరాబాద్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు.
అందరూ బాధితులే..
వందల మంది మహిళలు.. ముఖ్యంగా పాత్రికేయులు, న్యాయవాదులు, ఉద్యమకారులకు సంబంధించిన ఫొటోలను వేలానికి పెట్టారని, ఇందులో తెలంగాణకు చెందిన యువ పాత్రికేయులతో పాటు ఎంతోమంది సామాజిక కార్యకర్తలు ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీయడమే వీరి లక్ష్యమని ఆరోపించారు. మహిళలు ముఖ్యంగా ప్రజాసంఘాల ప్రతినిధులపై ఆన్‌లైన్‌లో వేధింపులు క్రమంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మతసామరస్యం కాపాడటంతో పాటు మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని విశ్వాసం ప్రకటించారు. కార్యక్రమంలో వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు వి.సంధ్య, పోటు కళావతి, సజయ, సత్యవాణి, సుజాత సూరేపల్లి, ఉషా సన్నిహిత, అనురాధ తదితరులు పాల్గొన్నారు.