తెలంగాణ

telangana

ETV Bharat / crime

'ప్రమాదానికి కారణం మైనర్​ డ్రైవింగ్​... యజమానితో పాటు మైనర్లు అరెస్టు' - కరీంనగర్​లో కారు బీభత్సం

Karimnagar Car Accident
కరీంనగర్​ రోడ్డు ప్రమాదం

By

Published : Jan 30, 2022, 4:08 PM IST

Updated : Jan 30, 2022, 7:33 PM IST

16:06 January 30

Karimnagar Car Accident: కరీంనగర్​ కారు ప్రమాదం నిందితులపై హత్య కేసు నమోదు

కారు యజమాని రాజేంద్రప్రసాద్‌, మరో ముగ్గురు మైనర్లు అరెస్టు: సీపీ సత్యనారాయణ

Karimnagar Car Accident: కరీంనగర్‌ కారు ప్రమాదం ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కారు యజమాని రాజేంద్రప్రసాద్​తో పాటు, మరో ముగ్గురు మైనర్లను అరెస్టు చేసినట్లు కరీంనగర్​ సీపీ సత్యనారాయణ.. మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. కారు యజమాని కుమారుడు(మైనర్‌) డ్రైవింగ్ చేశాడని సీపీ తెలిపారు. ప్రమాదానికి కారణం మైనర్​ డ్రైవింగేనని పేర్కొన్నారు.

హత్య కేసుగా

ఇద్దరు మైనర్​ స్నేహితులతో కలిసి బాలుడు కారు నడిపాడని.. కానీ వాహనం తానే నడిపినట్లు రాజేంద్రప్రసాద్​ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారని సీపీ చెప్పారు. తర్వాత విచారణలో అతని కుమారుడే కారు నడిపినట్లు తేలిందన్నారు. బ్రేక్​ బదులు, క్లచ్​ తొక్కడంతో ఘోర ప్రమాదం జరిగిందని వివరించారు. ఘటనపై యాక్సిడెంట్‌ కేసు కాకుండా హత్య కేసు నమోదు చేస్తున్నామన్న సీపీ.. నలుగురి అమాయకుల ప్రాణాలు పోయినందునే హత్య కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. మైనర్లకు కారు అందుబాటులో ఉంచినందునే యజమానిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

"తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు కారు నడిపాడు. ప్రమాద స్థలం నుంచి బాలురు వెంటనే పారిపోయారు. కారును తానే నడిపినట్లు తండ్రి రాజేంద్రప్రసాద్‌ నమ్మించే ప్రయత్నం చేశాడు. మైనర్ల నిర్లక్ష్యం నలుగురు అమాయకుల ప్రాణాలు తీసింది. ఘటనపై యాక్సిడెంట్‌ కేసు కాకుండా హత్య కేసు నమోదు చేశాం. నలుగురు చనిపోయినందున హత్య కేసు నమోదు చేస్తున్నాం."-సత్యనారాయణ, కరీంనగర్​ సీపీ

ప్రతిరోజూ వాకింగ్​కు

మైనర్లు ప్రతిరోజు ఉదయం కారు బయటికి తీస్తున్నారని.. అంబేడ్కర్‌ స్టేడియంలో వాకింగ్‌ కోసం కారులో వెళ్తారని సీపీ తెలిపారు. కారుపై ఓవర్‌ స్పీడ్‌ చలాన్లు ఇప్పటికే చాలా ఉన్నాయని వెల్లడించారు. స్మార్ట్​ సిటీ పనుల కోసం రోడ్డు పక్కన గుడిసెలను వారం క్రితం తొలగించామన్న సీపీ.. కొందరు రోడ్డు పక్కన గుడిసెల్లో వృత్తిపనులు చేస్తున్నారని పేర్కొన్నారు. రోడ్ల పక్కన అక్రమంగా గుడిసెలు వేసుకోవద్దని సీపీ సూచించారు. రోడ్డు పక్కన గుడిసెల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.

అసలేం జరిగిందంటే

కరీంనగర్​ నగరం నుంచి కోతిరాంపూర్​ వెళ్లే దారిలో.. కరీంనగర్‌- హైదరాబాద్‌ ప్రధాన రహదారి పక్కన కొందరు కూలీలు కొలిమి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఆదివారం కావటంతో మేకలు, గొర్రెల తలకాయలు, కాళ్లు కాల్చుకుంటూ... ఉపాధి పొందుతుంటారు. ఈ క్రమంలోనే ఉదయం 7 గంటల ప్రాంతంలో అటుగా దూసుకొచ్చిన కారు.. అదుపు తప్పి రోడ్డుపక్కన పనులు చేసుకుంటున్న కూలీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో జ్యోతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని హుటాహుటిన కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.... మరో ముగ్గురు మహిళలు మృతిచెందారు. చనిపోయిన వారిలో ఫరియాజ్​, సునీత, లలిత ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

100 కి.మీల వేగంతో

ప్రమాదానికి 5 నిమిషాల ముందు కారులో ఇంధనం నింపుకొని.. రాంగ్​ రూట్​లో వేగంగా వెళ్లినట్లు సీసీ కమెరాల్లో నమోదైంది. బాలుడికి డ్రైవింగ్​ రాకపోవడమే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. 100 కి.మీల వేగంతో కూలీలపైకి వాహనం దూసుకెళ్లినట్లు ఘటనాస్థలంలో ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రమాదం జరిగిన అనంతరం కారును వదిలేసి అందులో ఉన్న వారు పరారయ్యారు.

తక్షణ సాయం

అంతకుముందు బాధితుల కుటుంబాలు.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ముందు రహదారిపై రాస్తారోకో చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని బైఠాయించారు. ఆందోళనలో ప్రతిపక్షాల నాయకులు సైతం పాల్గొన్నారు. అక్కడికి చేరుకున్న ఏసీపీ తుల శ్రీనివాస్‌రావు సర్ది చెప్పడంతో బాధిత కుటుంబాలు ఆందోళనలను విరమించాయి. వారికి తక్షణ సాయం కింద పౌరసరఫరాల శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌.. రూ. 10,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందించినట్లు ఆర్డీవో ఆనంద్‌ కుమార్ తెలిపారు.

ఇదీ చదవండి: కరీంనగర్​ కారు ప్రమాద ఘటనపై ప్రతిపక్షాల ఆందోళన.. మంత్రి ఆర్థిక సాయం

Last Updated : Jan 30, 2022, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details