Shilpa fraud: మోసం చేయడమే ఆమె లక్ష్యం. భార్య చేసే మోసాలకు వత్తాసు పలకడమే భర్త లక్షణం. అధిక వడ్డీలు, వ్యాపారాల్లో లాభాల పేరిట వల వేసి.. వారి నుంచి కోట్లలో డబ్బులు తీసుకుని.. విలాసవంతమైన జీవితాన్ని గడపడమే ఆ దంపతుల ధ్యేయం. అలా మోసాలకు పాల్పడిన శిల్పా చౌదరి (Shilpa fraud) గుట్టు ఎట్టకేలకు బయటపడింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త శిల్పను, ఆమె భర్త శ్రీనివాస్‌ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. కోటి 5లక్షల రూపాయల తీసుకొని తిరిగి ఇవ్వలేదని దివ్య అనే మహిళ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గండిపేట సిగ్నేచర్ విల్లాస్‌లో నివాసం ఉంటున్న శిల్ప, ఆమె భర్తను అదుపులోకి తీసుకొని నార్సింగి పోలీసులు ప్రశ్నించారు. ఆమె బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. దివ్య నుంచి కోటికి పైగా నగదు తీసుకున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు తిరిగి చెల్లించకపోవడంతో శిల్ప, ఆమె భర్తను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
నార్సింగ్ పరిధిలో శిల్ప చిట్టీలపేరుతో మోసం చేశారు. శిల్ప, శ్రీనివాస్ ప్రసాద్ దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాం. నార్సింగ్ పీఎస్‌లో శిల్పపై దివ్య ఫిర్యాదు చేశారు. దివ్య నుంచి రూ.1.05 కోట్లు శిల్ప తీసుకున్నారు. గ్రేటర్ కమ్యూనిటీల్లో కిట్టీపార్టీలో శిల్పకు దివ్య పరిచయమైంది. రియల్ ఎస్టేట్, సినిమాల్లో పెట్టుబడి పేరుతో శిల్ప డబ్బులు వసూలు చేసేవారు. శిల్ప సహేరి అనే సినిమా తీసింది. శిల్పపై పలువురు బాధితులు ఇప్పటికే ఫిర్యాదు చేశారు.