తెలంగాణ

telangana

ETV Bharat / crime

Singareni: ఉద్యోగాల పేరిట వల.. కోల్‌బెల్టులో దళారుల దందా - peddapalli district latest news

Singareni: సింగరేణిలో జూనియర్‌ అసిస్టెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల కావడంతో దళారులు రంగంలోకి దిగారు. దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులను నమ్మించేందుకు తమకు పైవారితో పరిచయాలున్నాయని డబ్బులు దండుకుంటున్నారు. ముందే అడ్వాన్స్‌ కింద కొంతమొత్తం తీసుకుంటున్న దళారులు పరీక్షలు పూర్తయి ఉద్యోగానికి ఎంపికైన తర్వాత మిగతా మొత్తం చెల్లించాలని వారితో మాట తీసుకుంటున్నారు.

సింగరేణి
సింగరేణి

By

Published : Aug 12, 2022, 7:40 AM IST

Singareni: సింగరేణిలో జూనియర్‌ అసిస్టెంట్‌ నోటిఫికేషన్‌ ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు కల్పించేందుకు దళారులు దందా మొదలుపెట్టారు. సింగరేణి విస్తరించిన ఉన్న ఆరు జిల్లాల్లో దళారులు నిరుద్యోగుల నుంచి భారీగా దండుకోవడానికి పైరవీలు చేస్తామంటూ నమ్మిస్తున్నారు.. సింగరేణివ్యాప్తంగా కొంతమంది దళారులు నిరుద్యోగుల బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి మాయమాటలతో నమ్మిస్తున్నారు.

ఒక్కో ఉద్యోగానికి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. ఉద్యోగం ఆశతో ఇప్పటికే కొంతమంది నిరుద్యోగులు దళారులకు అడ్వాన్స్‌ కింద కొంత సమర్పించుకున్నారు. సింగరేణిలో అంతర్గత 155, ఎక్స్‌టర్నల్‌ ద్వారా 117 మంది జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడు-2 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అంతర్గత ఖాళీలను మే 19న, ఎక్స్‌టర్నల్‌ ఖాళీలకు జూన్‌ 16న నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అంతర్గత అభ్యర్థులు మే 25 నుంచి జూన్‌ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి గడువు విధించింది. ఎక్స్‌టర్నల్‌ అభ్యర్థులకు జూన్‌ 20 నుంచి జులై 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రస్తుతం సింగరేణిలో జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడు-2 ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో దళారులు రంగంలోకి దిగారు. దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులను నమ్మించేందుకు తమకు పైవారితో పరిచయాలున్నాయని డబ్బులు దండుకుంటున్నారు. ముందే అడ్వాన్స్‌ కింద కొంతమొత్తం తీసుకుంటున్న దళారులు పరీక్షలు పూర్తయి ఉద్యోగానికి ఎంపికైన తర్వాత మిగతా మొత్తం చెల్లించాలని వారితో మాట తీసుకుంటున్నారు.

* మా కుమారుడు డిగ్రీ చేసి ఖాళీగా ఉంటున్నాడు. ఎలాగైనా ఫర్వాలేదు.. ఉద్యోగం ఇప్పిస్తే చాలు.. రూ.లక్షలైనా అప్పజెప్పుతా.. పక్కాగా ఉద్యోగం కావాలి. ఆ గ్యారంటీ ఇచ్చేవారి వద్ద మాట్లాడు. పైసలు ఎక్కువైనా ఇచ్చుకుంటా.. ఓ దళారి వద్ద మాటామంతి ఇదీ..

* ఉద్యోగానికి ఎంపిక చేసేందుకు ఓ దళారికి రూ.5 లక్షల అడ్వాన్స్‌ కింద అప్పగించారు. పని పూర్తయిన తర్వాత మిగతా డబ్బులు చెల్లిస్తానని నిరుద్యోగి అంగీకారం కుదుర్చుకున్నాడు. ఉద్యోగం మాత్రం కావాలంటూ గ్యారంటీ తీసుకున్నాడు. ఎవరితో పనిచేయిస్తావన్నది అనవసరం. ఉద్యోగం ఇప్పించాలని చెప్పాడు.

మళ్లీ అదే కథ:సింగరేణిలో 2015లో 450 జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడు-2 ఉద్యోగ నియామకాల సమయంలోనూ పరీక్షల్లో గందరగోళం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. పైరవీలు చేసుకున్న వారే ఉద్యోగాలకు ఎంపికయ్యారని ప్రచారం జరిగింది. ఆ సమయంలోనూ పైరవీకారులు, దళారులు భారీగా త్తున నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశారు.

ఆ తర్వాత మళ్లీ తాజాగా జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడు-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలవడంతో మళ్లీ పైరవీల దందా మొదలైంది. 2015లో నిర్వహించిన ఉద్యోగ ఎంపికలో ఒకే ఇంట్లో ఇద్దరికి, ఒకే ప్రాంతానికి చెందినవారు ఎంపికయ్యారని ఆరోపణలు వచ్చాయి. మళ్లీ అదేవిధంగా ఈసారి ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదలవడంతో దళారులు డబ్బులు దండుకునే పనిలో పడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న సింగరేణి సంస్థలో ఉద్యోగం దొరికితే భద్రత ఉంటుందన్న ఆశతో నిరుద్యోగులు ఎంత డబ్బులు చెల్లించడానికైనా ఆసక్తి చూపుతున్నారు. వారి బలహీనతలను ఆసరాగా చేసుకుంటున్న పైరవీకారులు సొమ్ము చేసుకుంటున్నారు.

అత్యధికంగా దరఖాస్తులు:సింగరేణిలో ఖాళీగా ఉన్న జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడు-2 ఖాళీల కోసం నిరుద్యోగులైన అభ్యర్థులు భారీ మొత్తంలో దరఖాస్తు చేసుకున్నారు. అంతర్గత ఖాళీలతో పాటు ఎక్స్‌టర్నల్‌ ఖాళీలకు అత్యధికంగా దరఖాస్తులు చేసుకున్నారు. ఎక్స్‌టర్నల్‌ ఖాళీలు 117 ఉద్యోగాలకు 1,03,000 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. అంతర్గత ఖాళీలకు అర్హులైన ఉద్యోగులు 10 వేల వరకు దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబరు 4న రాత పరీక్షలకు సింగరేణి ఏర్పాట్లు చేస్తోంది. గతంలో జేఎన్టీయూ పరీక్షల బాధ్యతను అప్పగించింది. అప్పట్లో దీనిపై వివాదం తలెత్తింది. ఈసారి సింగరేణి యాజమాన్యమే స్వయంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పారదర్శకంగా ఎంపిక: "సింగరేణి ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది. దళారులకు డబ్బులిచ్చి మోసపోవద్దు. దళారులు వచ్చి అడిగితే సమాచారం ఇవ్వండి. వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టిస్తాం. దళారులు మాటలు నమ్మి ఎవరూ డబ్బులు నష్టపోవద్దు. జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడు-2 ఉద్యోగాల ఎంపికపై ఎలాంటి అపోహలకు తావులేదు. ప్రతిభకే అవకాశం ఉంటుంది. పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తాం. పైరవీకారులు చెప్పే మాయమాటలను నమ్మవద్దు." - బలరాం, సింగరేణి సంచాలకులు

ఇవీ చదవండి:నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న గ్రంథాలయాలు.. మౌలిక వసతుల కల్పనకు ఆమడదూరం

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం

ABOUT THE AUTHOR

...view details