తెలంగాణ

telangana

ETV Bharat / crime

Boy Kidnap in Hyderabad : హైదరాబాద్‌లో కిడ్నాప్‌ చేసి.. దిల్లీలో పోలీసులకు అప్పజెప్పాడు - దిల్లీలో హైదరాబాద్‌లో అదృశ్యమైన బాలుడు

Boy Kidnap in Hyderabad : ఆరేళ్ల బాలుడు ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌లో అదృశ్యమయ్యాడు. కంగారుపడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలుడి కోసం వెతకడం మొదలుపెట్టారు. నగరమంతా వెతికినా ఎక్కడా ఆచూకీ దొరకలేదు. ఎవరైనా కిడ్నాప్‌ చేసి వేరే ప్రాంతానికి తీసుకెళ్లారేమోనని అనుమానమొచ్చి.. బాలుడి వివరాలు ట్విటర్, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. చివరకు వాటి ద్వారానే ఆ బుడ్డోణ్ని ట్రేస్ చేశారు. ఇంతకీ విచిత్రమేంటంటే.. బాలుడిని హైదరాబాద్‌లో కిడ్నాప్‌ చేసిన వ్యక్తే.. రైల్లో దిల్లీకి తీసుకువెళ్లి పోలీసులకు అప్పజెప్పాడు. అంతే కాకుండా పోలీసులకు అతడి ఆధార్ కార్డు, ఇతర వివరాలు ఇచ్చాడు.

Boy Kidnap in Hyderabad
Boy Kidnap in Hyderabad

By

Published : Feb 23, 2022, 10:31 AM IST

Boy Kidnap in Hyderabad : ఆరేళ్ల బాలుడు అనూహ్యంగా ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌లో అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు కంగారుపడి అన్నిచోట్లా వెతుకుతుండగా ఉన్నట్టుండి దిల్లీలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారంతో హబీబ్‌నగర్‌ ఠాణా సిబ్బంది హుటాహుటిన విమానంలో వెళ్లి బాలుణ్ని తీసుకువచ్చి సోమవారం సాయంత్రం అప్పగించారు. మల్లేపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు హబీబ్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ కథనం ప్రకారం.. మల్లేపల్లి బడీమసీదు ప్రాంతంలో ఉంటున్న కారు డ్రైవర్‌ హనీఫ్‌ కుమారుడు అయాన్‌ ఈనెల 17న తప్పిపోయాడు. పోలీసులు మూడు కమిషనరేట్ల పరిధుల్లో గాలిస్తున్నారు. అదే సమయంలో బాలుడి వివరాలు ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయగా వాటిని చూసిన దిల్లీలోని నిజాముద్దీన్‌ పోలీసులు ఆదివారం సమాచారం ఇచ్చారు.

సమాధానం లేని ప్రశ్నలెన్నో..

అయాన్‌ను తీసుకువచ్చేందుకు అదనపు ఇన్‌స్పెక్టర్‌ నరసింహ, బాలుడి తండ్రి హనీఫ్‌లు ఆదివారం దిల్లీకి వెళ్లారు. నిజాముద్దీన్‌ ఠాణాలో ఉన్న బాలుణ్ని తీసుకుని నగరానికి సోమవారం వచ్చారు. ఈ నెల 19న ఒక అపరిచిత వ్యక్తి ఠాణాకు వచ్చి తన ఆధార్‌, ఇతర వివరాలు నమోదుచేసి అయాన్‌ను అప్పగించి వెళ్లాడంటూ నిజాముద్దీన్‌ పోలీసులు చెప్పారు. మల్లేపల్లిలో ఉన్న బాలుణ్ని ఆ వ్యక్తే చేరదీసి రైల్లో దిల్లీకి తీసుకెళ్లాడని పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించాయి. కిడ్నాప్‌ చేసిన వ్యక్తి రైల్లో ఎందుకు తీసుకెళ్లాడు? ఎందుకు దిల్లీ పోలీసులకు అప్పజెప్పాడన్నది అంతుచిక్కడం లేదు. కిడ్నాప్‌ చేసుంటే ఆధార్‌కార్డు, వివరాలు పోలీసులకు ఎందుకు ఇచ్చాడని ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details