తెలంగాణ

telangana

ETV Bharat / crime

తాత ఫోన్​లో మనవడి ఫ్రీఫైర్​ గేమ్​.. 36 లక్షలు గోవిందా..!! - kids gaming fraud

boy lost 44 lakhs with gaming in grand father mobile
boy lost 44 lakhs with gaming in grand father mobile

By

Published : Jun 3, 2022, 5:09 PM IST

Updated : Jun 3, 2022, 8:41 PM IST

17:00 June 03

తాత ఫోన్​లో మనవడి ఫ్రీఫైర్​ గేమ్​.. 36 లక్షలు గోవిందా..!!

ఈకాలం పిల్లలు.. యమా స్పీడ్​గా ఉన్నారు. కనీసం మాటలు కూడా సరిగా పలకలేని చిన్నారులు సైతం.. సెల్​ఫోన్​లతో ఓ ఆట ఆడేసుకుంటున్నారు. చేతిలో మొబైల్​ లేకపోతే నోట్లో ముద్ద కూడా పెట్టుకోనంతగా అలవాటు పడిపోయారు. అదేంటో.. పెద్దలకు కూడా తెలియని మొబైల్​ ఆపరేటింగ్​.. పిల్లలకు అలవోకగా తెలిసిపోతుంది. వాట్స్​ప్​లో వీడియోకాల్స్ చేసి మాట్లాడటం​.. యూట్యూబ్​లో నచ్చిన పాటలు పెట్టుకుని డ్యాన్సులు వేయటం.. ప్లేస్టోర్​లో మంచిమంచి గేమ్​లు ఇన్​స్టాల్​ చేసి ఆడుకోవటం.. ఇలా చరవాణిలో ఎన్ని ఫీచర్లుంటే అన్నింటినీ ఇట్టే ఒంటపట్టించుకుని అందులో ఆరితేరిపోతున్నారు. అలాంటి ఓ చిచ్చరి పిడుగు.. తాత మొబైల్​లో గేమ్​ ఆడి ఏకంగా 36 లక్షలు మాయం చేశాడు. ఈ ఆసక్తికర ఘటన.. హైదరాబాద్​ అంబర్​పేటలో చోటుచేసుకుంది.

హైదరాబాద్​ అంబర్​పేటకు చెందిన ఓ విశ్రాంత పోలీస్​.. ఇటీవలే మరణించారు. అయితే ఇన్ని రోజులు వాడిన మొబైల్​.. ఆయన మరణం తర్వాత ఖాళీగానే ఉంది. అది గమనించింన కుమార్తె కొడుకు దాన్ని వాడటం ప్రారంభించాడు. తల్లిదండ్రులను అడిగితే ఎప్పుడూ విసుక్కోవటం వల్ల.. ఖాళీగా ఉన్న తాత మొబైల్​ దొరకగానే కోట్లు సంపాదించినంత ఆనందం ఆ మనువడి సొంతమైంది.

బాలునికి గేమ్స్​ ఆడటం ఇష్టం ఉండటంతో.. నచ్చిన గేమ్​ డౌన్​లోడ్​ చేసుకోవటం.. ఆడుకోవటం అలవాటే. అందులో భాగంగానే.. ఓ రోజు ఫ్రీఫైర్​ గేమ్​ను డౌన్​లోడ్​ చేసి ఆడటం మొదలుపెట్టాడు. సదరు గేమ్​లో కొన్నిసార్లు.. ఆయా స్టేజ్​లు దాటాలన్నా, ఆయుధాలు కావాలన్నా.. డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ సందర్భం మన బాలునికి తొందరగానే వచ్చింది. మొదటిసారి 1500 రూపాయలు పెట్టి గేమ్​ ఆడాడు. అయితే.. మొబైల్​లో డిజిటల్​ పేమెంట్​ యాప్స్​తో పాటు నెట్​బ్యాంకింగ్​ను తాత​ రెగ్యులర్​గా వాడి ఉండటం వల్లో.. లేక పాస్​వర్డ్​లు క్లిష్టంగా పెట్టకపోవటం వల్లో.. మన గేమింగ్​ స్టార్​కు పెద్దగా కష్టమేమి కలగలేదు. పేమెంట్​ ప్రక్రియ సులభంగానే జరిగిపోయింది.

గేమ్​లోని స్టేజ్​లు తొందరతొందరగా దాటాలన్న ఆత్రుతతో పిల్లాడు.. తరచూ పేమెంట్లు చేస్తున్నే ఉన్నాడు. ఇలా.. 10 వేల చొప్పున 60 సార్లు నగదు పెట్టి గేమ్​ ఆడాడు. ప్రతీసారి డబ్బు చెల్లించి ఆడుతుండటంతో గేమింగ్​ సిబ్బంది.. మొబైల్​లోని అకౌంట్​పై కన్నేశారు. చరవాణిలో నెట్ బ్యాంకింగ్ ఉండటం వాళ్లకు కలిసొచ్చే అంశం కావటం వల్ల.. 10 వేలు కాకుండా ఈసారి పెద్ద మొత్తానికే టెండర్​ వేశారు. 2 లక్షలు, లక్ష 95వేలు, లక్ష 60వేలు, లక్ష 45 వేలు, లక్ష 25 వేలు, 50 వేలు చొప్పున వేర్వేరు సందర్భాల్లో నగదు స్వాహా చేశారు. ఇలా.. మొత్తం కలిపి తాత అకౌంట్​ నుంచి ఏకంగా 36 లక్షలు మాయమయ్యాయి.

ఇదిలా ఉంటే.. ఏదో అవసరం పడి నగదు డ్రా చేద్దామని సదరు బాలుడి కుటుంబసభ్యులు బ్యాంకుకు వెళ్లారు. నగదులో నిండుగా ఉండాల్సిన అకౌంట్​.. నిల్​ అని చూపించటంతో అవాక్కవటం వాళ్ల వంతైంది. ఆ షాక్​ నుంచి తేరుకుని విషయంపై ఆరా తీయగా.. బ్యాంకు సిబ్బంది నగదు వివరాలు అందించగా... అసలు విషయం అవగతమైంది. ఆ షాక్​ నుంచి తేరుకుని.. వెంటనే కుటుంబసభ్యులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

జెట్​ స్పీడ్​తో మారిపోతున్న ప్రపంచానికి తగినట్టు.. పిల్లలు అలవాట్లు ఉండటం ఓవైపు ఆనందం, మరోవైపు ఆశ్చర్యం కలిగిస్తున్నా.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం భయపడాల్సి వస్తోంది. మొబైల్స్​ని ఒంటి చేత్తో ఆటాడుకోవటం చూసి గొప్పలు చెప్పుకోవాలో.. దానికి బానిసై మిగతా వాటిని నిర్లక్ష్యం చేయడాన్ని చూసి బాధపడాలో తెలియని అయోమయంలో తల్లిదండ్రులు తలలుపట్టుకుంటున్నారు. పిల్లలు చురుకుగా ఉండటం ఒకింత సంతోషించదగ్గ విషయమే అయినప్పటికీ.. తల్లిదండ్రులు వాళ్లపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచాలన్నది నిపుణుల సూచన. ఇలాంటిదేదో జరగక ముందే.. జాగ్రత్త పడటం మంచిదేగా మరి..!

ఇవీ చూడండి:

Last Updated : Jun 3, 2022, 8:41 PM IST

ABOUT THE AUTHOR

...view details