ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా సీలేరు నదిలో ప్రయాణికులతో వెళ్తున్న రెండు నాటు పడవలు ప్రమాదానికి గురయ్యాయి. పడవలు నీట మునగడంతో 8 మంది గల్లంతు కాగా.. వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఏడాది బాలుడు అభి, గాయత్రి(4), అనూష(23) మృతదేహాలు వెలికితీశారు. ప్రమాదం నుంచి బయటపడి.. ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
నదిలో మునిగిన నాటుపడవలు.. ముగ్గురు మృతి - సీలేరు నాటు పడవలు గల్లంతు
06:59 May 25
8 మంది గల్లంతు, ఒకరి మృతదేహం లభ్యం
ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కోందుగూడా గ్రామానికి చెందిన సుమారు 11 మంది గిరిజనులు.. హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ బతికేవారు. తెలంగాణాలో లాక్‌డౌన్ నేపథ్యంలో పనులు నిలిచిపోవడంతో స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ నుంచి సోమవారం రాత్రికి సీలేరు చేరుకున్నారు. తమను వెళ్లకుండా ఎవరైనా అడ్డుపడతారేమోనని భయంతో సీలేరు శివార్లలో గల చెక్‌పోస్ట్ వద్దకు చేరుకుని.. అర్ధరాత్రి వరకూ అక్కడే ఉన్నారు. చెక్‌పోస్టు వెనకభాగం నుంచి టేకుతోటల మీదుగా సీలేరు నది వద్దకు వెళ్లారు. అప్పటికే.. వారి గ్రామస్థులకు విషయం తెలియజేయడంతో వీరి ప్రయాణం కోసం రెండు నాటు పడవలను సిద్ధం చేసి ఉంచారు.
నది మధ్యలో అదుపుతప్పారు
రెండు నాటు పడవలు మీద 11 మంది బయలుదేరారు. నది మధ్యలోకి వెళ్లేసరికి ముందుగా వెళ్తున్న నాటుపడవ అదుపుతప్పి బోల్తాపడింది. రెండో నాటుపడవలో ఉన్నవారు నదిలో పడ్డవారిని రక్షించడానికి ప్రయత్నించగా..ఆ పడవ కూడా మునిగిపోయింది. రెండు పడవల్లో ఉన్నవారూ నీట మునిగారు. ముగ్గురు వ్యక్తులు ఈతకొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకుని స్వగ్రామానికి వెళ్లి విషయం తెలియజేశారు.
సమాచారం అందుకున్న మల్కన్‌గిరి జిల్లా అధికారులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందిని ఘటనా స్థలికి పంపించారు. నదిలో ఏడాది బాలుడు అభి, చిన్నారి గాయత్రి(4), అనూష(23) మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనా స్థలానికి సీలేరు ఎస్సైలు రంజిత్, రమణలు, చిత్రకొండ పోలీసు అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంత్తైన ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి:కరోనా టెస్టు చేయించుకోలేదని యువకులపై దాడి