Mobile phone theft gangs arrested: ఆటోలు నడుపుతూ ప్రయాణికుల దృష్ణి మరల్చి వారి చరవాణులను చోరీ చేస్తున్న నాలుగు ముఠాలను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్(hyderabad taskforce) పోలీసులు అరెస్ట్ చేశారు. పలు ఫిర్యాదులు రావడంలో కంచన్ బాగ్, చంద్రాయణగుట్ట, డబీర్ పురా, అఫ్జల్ గంజ్ ప్రాంతాల్లో దక్షిణ, తూర్పు మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు.
మొత్తం నాలుగు ముఠాల్లోని 9 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 92 చరవాణులు, రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధుల్లో వీరిపై 19 కేసులు ఉన్నాయని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్(hyderabad cp anjanikumar) వెల్లడించారు. నగరంలో ఆటోలు నడుపుతూ మరో ఇద్దరు ప్రయాణికులు లాగా వెనుక కూర్చుని ప్రయాణికులు దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్నట్లు వివరించారు. స్వాధీనం చేసుకున్న చరవాణుల విలువ సుమారు 12లక్షలు ఉంటుందని తెలిపారు.
నిందితులు మహమ్మద్ మహమూద్ అలీ, మహ్మద్‌ఖాన్, హమీద్‌ఖాన్, మహ్మద్ మోసిన్, మహ్మద్ మౌసీ, మహ్మద్ బూసా, మహ్మద్ అబ్దుల్ హాజీ, మహ్మద్ రఫీక్, మహ్మద్ దస్తగీర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ఏడాది నేరాలకు పాల్పడే 141 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. మత్తు పదార్ధాల కేసుల్లో 9మందిపై పీడీ యాక్ట్ పెట్టామన్నారు. 8 మంది రౌడషీటర్లపై పీడీ యాక్టు నమోదు చేశామన్నారు.