తెలంగాణ

telangana

ETV Bharat / crime

బెట్టింగ్​ ముఠాలపై ఏపీ పోలీసులు ప్రత్యేక నిఘా - ipl betting

ఐపీఎల్‌ క్రికెట్‌ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తుండగా.. క్రికెట్‌ బెట్టింగ్‌ అనేకమంది జీవితాల్లో చీకట్లు నింపుతోంది. యువత ఆసక్తిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ బెట్టింగ్‌ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. గతంలో బెట్టింగ్ ముఠాల ఆట కట్టించిన ఏపీలోని గుంటూరు పోలీసులు.. ప్రస్తుత సీజన్‌లోనూ ఈ దందాపై ప్రత్యేక నిఘా పెట్టారు.

betting
betting

By

Published : Apr 20, 2021, 8:00 PM IST

బెట్టింగ్​ ముఠాలపై ఏపీ పోలీసులు ప్రత్యేక నిఘా

చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు క్రికెట్‌ అంటే వీరాభిమానం. టీవీలో వచ్చిన ప్రతి మ్యాచ్‌ను ఎంతో ఉత్కంఠగా చూస్తుంటారు. సెంటిమెంట్లు, ఈలలు, అరుపులతో ఒకటే గోల. ఇదంతా తెర ముందు వినోదం మాత్రమే. కానీ తెర వెనక చీకటి కార్యకలాపాలతో కుటుంబాలే నాశనమవుతున్నాయి. యువత, ఉద్యోగులే కాకుండా కూలీలు సైతం మొగ్గు చూపటంతో బెట్టింగ్‌ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఈ ఉచ్చులో పడి.. చేసిన అప్పులు తీర్చలేక ప్రాణాల్నే పణంగా పెట్టిన ఉదంతాలు ఏపీలోని గుంటూరు జిల్లాలో గతంలో ఎన్నో వెలుగుచూశాయి.

మ్యాచ్‌లో టాస్ మొదలుకొని ఆఖరి బంతి వరకు ప్రతిదీ బెట్టింగే. మ్యాచ్‌ గెలిచేది ఎవరు? ఎక్కువ స్కోర్ ఎవరు చేస్తారు? వికెట్ల వేటలో విజేత ఎవరు? ఇలా ప్రతి అంశంపైనా బెట్టింగులు జరుగుతుంటాయి. కోడిపందేలు, పేకాటలాగా.. ఇదంతా అందరూ ఒకేచోట కూర్చుని చేసే వ్యవహారం కాదు. సాంకేతికత సాయంతో అంతా ఆన్​లైన్‌లోనే నడిపిస్తారు. సెల్‌ఫోన్లలో ఒకేసారి 20, 30 మందితో మాట్లాడుతూ..క్షణాల్లో లక్షల డబ్బు చేతులు మారిపోతుంటుంది. రోజుకో కొత్త మార్గంలో ఈ దందాని గుట్టుచప్పుడు కాకుండా నిర్వాహకులు కానిచ్చేస్తున్నారు.

ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లు జోరుగా సాగుతున్న వేళ.. బెట్టింగ్‌ ముఠాల కదలికలపై పోలీసులు ఓ కన్నేశారు. ఇంటర్‌నెట్ కేంద్రాలు, హోటళ్లు, శివారు అపార్టుమెంట్లపై నిఘా పెంచారు. ఎలాంటి సమాచారం తెలిసినా ప్రజలు వెంటనే ఫిర్యాదు చేయాలని గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి కోరుతున్నారు.

సమాజాన్నే చిన్నాభిన్నం చేస్తున్న క్రికెట్ బెట్టింగులపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు స్పష్టం చేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల నడవడికపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.

ఇదీచదవండి:అప్పట్లో జడేజా ఫీల్డింగ్​పై​ ధోనీ ట్వీట్.. ఇప్పుడు వైరల్

ABOUT THE AUTHOR

...view details