Panchayat Secretary Venkatesh suicide updates: ఆత్మహత్యకు యత్నించి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నారాయణపురం పంచాయతీ కార్యదర్శి ఈసం వెంకటేశ్ అంత్యక్రియలు ఆందోళనల మధ్య ముగిశాయి. మృతదేహాన్ని అధికారులు పోలీసు బందోబస్తు మధ్య ఆదివారం అర్ధరాత్రి ఆయన స్వగ్రామం పాత ఇర్సులాపురానికి చేర్చారు.
సోమవారం ఉదయం సీఐ తిరుపతి మృతుని భార్య సుభద్రను కలెక్టర్ శశాంక వద్దకు తీసుకెళ్లి ఆమెకు ఉద్యోగం ఇచ్చేలా హామీ తీసుకొని తిరిగి గ్రామానికి చేరుకున్నారు. అంత్యక్రియలకు(Venkatesh's funeral) ఏర్పాట్లు చేస్తుండగా వివిధ జిల్లాల నుంచి అక్కడికి చేరుకున్న పంచాయతీ కార్యదర్శులు, జాక్టో, టీపీఎస్‌జేఏసీ(TPSJAC) సహా వివిధ సంఘాల నేతలు అడ్డుకున్నారు. అధికారులు ఇప్పటివరకు మౌఖికంగా 32 మంది కార్యదర్శుల కుటుంబాలకు హామీ ఇచ్చినా న్యాయం జరగలేదని, లిఖితపూర్వకంగా హామీ ఇచ్చే వరకూ అంత్యక్రియలు నిర్వహించేది లేదని తెగేసి చెప్పారు. అక్కడే బైఠాయించారు. డీపీవో సాయిబాబా, ఆర్డీవో కొమరయ్య తదితరులు నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది.
పరిస్థితిని కలెక్టర్‌కు వివరించిన అధికారులు సుభద్రకు ఒప్పంద విధానంలో ఉద్యోగం ఇస్తామనే హామీ లేఖను అందించినప్పటికీ కొన్ని సంఘాల వారు అంగీకరించలేదు. వెంటనే నియామక ఉత్వరులు ఇవ్వాలని, పరిహారం కూడా ఇప్పుడే అందించాలనే డిమాండ్లతో ఆందోళనను కొనసాగించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, సంఘాల నేతలు, కార్యదర్శులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకోవడంతోపాటు అక్కడున్న వారిని చెదరగొట్టారు. పరిస్థితి అదుపులోకి రావడంతో అంత్యక్రియలు పూర్తిచేశారు.