విదేశీ కొలువుల కోసం తప్పుడు పత్రాలు సమర్పిస్తున్న వారిపై అమెరికా అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. గతంలో కంటే భిన్నంగా ఇప్పుడు అభ్యర్థులు అందజేస్తున్న అనుభవ, రుణ ధ్రువీకరణ, బ్యాంక్ బ్యాలెన్స్ పత్రాలను ప్రైవేటు సంస్థల ద్వారా క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. వాటి నిబద్ధతనూ తనిఖీ చేస్తోండటంతో అక్రమార్కుల బండారం బయటపడుతోంది. వీసా ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడే ఈ నకిలీ పత్రాల గుట్టు రట్టవుతోంది. సమర్పించిన పత్రాలు నకిలీవనడానికి తాము సేకరించిన ఆధారాలను అధికారులు వారి ముందు పెడుతుండటంతో కళ్లు తేలేయటం అభ్యర్థుల వంతవుతోంది. దిల్లీలోని అమెరికన్(యూఎస్) ఎంబసీలో మార్చి 24 నుంచి ఈ నెల 10 వరకూ ఇంటర్వ్యూలకు హాజరైన వారిలో నకిలీ పత్రాలిచ్చిన వారిపై.. ఎంబసీ సహాయ ప్రాంతీయ భద్రత అధికారి కోరీ ఎం.థామస్ దిల్లీ చాణక్యపురి పోలీసుఠాణాలో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు, కన్సల్టెన్సీలు, సహకరించిన ఏజెంట్లపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో దిల్లీ పోలీసులు మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో దాడులు జరిపి పలువురిని అరెస్ట్ చేశారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తుండటంతో ఇంకొందరి పేర్లు బహిర్గతమయ్యే అవకాశముంది.
రూ.24 లక్షలున్నట్లు బ్యాంకు బ్యాలెన్స్ పత్రాలు:హైదరాబాద్‌కు చెందిన ఓ అభ్యర్థి నాన్-ఇమ్మిగ్రెంట్ స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎర్రగడ్డలోని వెర్టెక్స్ నెట్‌కామ్ సొల్యూషన్స్‌లో నెలకు రూ.18వేల వేతనంతో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నట్లు వీసా ప్రాసెసింగ్ సమయంలో చెప్పాడు. అదే సంస్థ నుంచి ఇంటర్న్‌షిప్ లెటర్, మహారాష్ట్ర నాందేడ్‌లోని గోదావరి అర్బన్ మల్టీస్టేట్ క్రెడిట్ కో-ఆపరేటివ్ బ్యాంకు పాస్‌బుక్, గత మార్చి 30నాటికి ఆ ఖాతాలో రూ.24,17,110 నిల్వ ఉన్నట్లు చూపాడు. ఈ నెల 8న యూఎస్ ఎంబసీలో జరిగిన ఇంటర్వ్యూలో మాత్రం తన తప్పిదాలను అంగీకరించాడు. వెర్టెక్స్ సంస్థలో తానెప్పుడూ పనిచేయలేదని తెలిపాడు. డీఎఫ్‌ఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఏజెంట్ అసీర్ సూచన మేరకు గౌస్ అనే వ్యక్తికి రూ.3వేలు ఇవ్వడంతో వెర్టెక్స్ సంస్థ పేరిట తప్పుడు ధ్రువీకరణ పత్రాలిచ్చారని తెలిపాడు. రవి, నర్సింగ్‌లకు రూ.20 వేలిస్తే బ్యాంకు ఖాతాలో నగదు నిల్వ పత్రాలు ఇచ్చారని అంగీకరించాడు.
ఐటీ మేనేజర్‌నంటూ తప్పుడు సమాచారం:వరంగల్‌కు చెందిన మరో అభ్యర్థి 2017 సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకూ సాఫ్ట్‌టెక్ కంప్యూటర్స్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు వీసా దరఖాస్తులో పేర్కొన్నాడు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ నుంచి రూ.25 లక్షల రుణం మంజూరైందని, తన ఖాతాలో రూ.25,02,500 నగదు ఉందని కూడా పేర్కొన్నాడు. కానీ, ఈ నెల 5న జరిగిన వీసా ఇంటర్వ్యూ సందర్భంగా తాను సాఫ్ట్‌టెక్‌లో పనిచేయలేదని అంగీకరించాడు. రూ.5వేలు తీసుకొని మధుమిత దండె ఈ పత్రాలన్నీ సమకూర్చిందని ఒప్పుకొన్నాడు.
రూ.4వేలిస్తే సరి.. తప్పుడు ఉద్యోగ ధ్రువపత్రం:వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తికి చెందిన మరో అభ్యర్థి సాఫ్ట్‌టెక్ కంప్యూటర్స్‌లో పైథాన్ కోర్సు పూర్తిచేసినట్లు పేర్కొన్నాడు. కాన్సులేట్ దర్యాప్తులో అతను ఇచ్చిన ధ్రువపత్రం నకిలీదని వెల్లడైంది. హనుమకొండలోని సాఫ్ట్‌టెక్ సంస్థ డైరెక్టర్ మధుమిత దండే ఈ ధ్రువపత్రం ఇచ్చినట్లు కాన్సులేట్ ఇంటర్వ్యూలోనే వెల్లడించాడు. ఇందుకు రూ.4వేలు చెల్లించానన్నాడు.
నిందిత ఏజెంట్లు..
*వెంకటకిషోర్ వడ్లమూడి (వి1 ఓవర్సీస్ కన్సల్టెన్సీ, అనూశ్రీ ప్లాజా, లక్ష్మీపురం- గుంటూరు)