ACP On Banjarahills Girl Rape Case: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పాఠశాలలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ వెల్లడించారు. నిందితుడిపై అత్యాచారం కేసుతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. పాఠశాలలో ఘటన జరగడంతో ప్రిన్సిపల్‌పైనా కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.
పాఠశాలలో నాలుగేళ్ల బాలికపై ఆ పాఠశాలకు చెందిన ప్రిన్సిపల్‌కు డ్రైవర్‌గా పనిచేస్తున్న రంజిత్ అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. బాలికను భరోసా కేంద్రానికి పంపించినట్లు పేర్కొన్నారు. పాఠశాలకు వెళ్లి నిందితుడు రంజిత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ఏసీపీ తెలిపారు. నేరం రుజువైతే నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు మరణ శిక్షపడే అవకాశం ఉంటుందని ఏసీపీ సుదర్శన్ చెప్పారు. మరోవైపు బంజారాహిల్స్ పీఎస్ ఆవరణలో బాధిత బాలిక కుటుంబసభ్యులు ఆందోళన చేప్టటారు. నిందితుడిని తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.
"నాలుగు సంవత్సరాల చిన్నారిపై ప్రిన్సిపల్‌కు డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్టు ఫిర్యాదు వచ్చింది. మా సిబ్బంది వెంటనే కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలికను భరోసా కేంద్రానికి పంపించాం. నిందితుడిపై అత్యాచారం, పోక్సో కింద కేసు నమోదు చేశాం. పాఠశాల ప్రిన్సిపల్‌పైనా కేసు నమోదు చేశాం. నేరం రుజువైతే నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష లేదా మరణ శిక్ష పడొచ్చు. పాఠశాల యజమాన్యంపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. -ఏసీపీ సుదర్శన్ బంజారాహిల్స్