భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా ఓసీ-2 గనిలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు సింగరేణి కార్మికులతో పాటు బొలెరో వాహనం డ్రైవర్ దుర్మరణం పాలైన ఘటన బుధవారం చోటు చేసుకుంది. గనిలో భాష్య(48) ఎలక్ట్రీషియన్‌గా, సాగర్(33) జనరల్ మజ్దూర్‌గా, వాహన డ్రైవర్ వెంకన్న(45) ఒప్పంద కార్మికుడిగా పని చేస్తున్నారు. డ్రిల్లింగ్ యంత్రం సర్వీసింగ్ చేసేందుకు భాష్య, సాగర్లను బొలెరో వాహనంలో డ్రైవర్ వెంకన్న తీసుకెళ్తున్నారు. ఆ రహదారిలో వంద టన్నుల సామర్థ్యం కలిగిన డంపర్ ఓబీని లోడ్ చేసుకునేందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో ఆర్ఎల్ 765 స్థలం వద్ద డంపర్ ఆపరేటర్ చూసుకోకుండా ఎదురుగా వెళ్తున్న బొలెరో వాహనంపై నుంచి డంపర్‌ను నడిపాడు.
నుజ్జునుజ్జయిన బొలెరో
ఈ ప్రమాదంలో బొలెరో వాహనం నుజ్జునుజ్జయింది. వాహనంలో ప్రయాణిస్తున్న సింగరేణి కార్మికులు భాష్య, సాగర్‌తో పాటు వాహన డ్రైవర్ వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న తోటి కార్మికులు, అధికారులు వాహనంలో ఉన్న కార్మికుల మృతదేహాలను బయటకు తీసుకువచ్చేందుకు ఎంతగానో శ్రమించారు. గ్యాస్ వెల్డింగ్ సాయంతో వాహనాన్ని కట్ చేసి అరగంట తర్వాత మృతదేహాలను బయటికి తీశారు. అనంతరం మృతదేహాలను సింగరేణి ఆస్పత్రికి తరలించారు. డంపర్ ఆపరేటర్ నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే ప్రమాదం సంభవించిందని పలువురు తెలిపారు. సింగరేణి ఆస్పత్రిలో కార్మికుల మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
పరిహారం చెల్లించాలని ధర్నా
ఓసీ-2 గనిలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సాంబశివరావు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా మృతదేహాలకు రాత్రి ఏడు తరువాత శవ పరీక్ష నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి ఆస్పత్రి శవపరీక్ష గది ఎదుట ధర్నా నిర్వహించారు. మృతి చెందిన కుటుంబాలకు సింగరేణి అధికారులు ఇంత వరకు ఓదార్పు ఇవ్వకుండా.. హుటాహుటిన రాత్రి ఏడు తర్వాత శవపరీక్ష నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. కనీస బాధ్యత లేకుండా వ్యవహరించడం సింగరేణికి తగదన్నారు. మృతి చెందిన ఒప్పంద కార్మికుడి కుటుంబానికి పరిహారంతో పాటు సింగరేణిలో శాశ్వత ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అందుకు హామీ పత్రం ఇచ్చేంత వరకూ కదిలేది లేదన్నారు.
ఇదీ చదవండి:ఎలుగుబంటి దాడి.. పశువుల కాపరి పరిస్థితి విషమం