యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది - telangana varthalu
20:24 March 02
యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది
రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధి హైదర్షాకోట్ లక్ష్మినగర్‌లో దారుణం చోటుచేసుకుంది. యువతిపై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉండగా... చికిత్స నిమిత్తం లంగర్‌హౌస్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. హైదర్షాకోట్లోని ఓ సెలూన్‌లో పనిచేస్తున్న షారుఖ్ సల్మాన్ ఈ ఉన్మాదానికి తెగబడ్డట్లు పోలీసులు గుర్తించారు. యువతితో అతడి స్నేహం పెంచుకున్నాడు. ఆ తర్వాత ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురిచేసినట్లు బాధితురాలి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇవాళ రాత్రి 8గంటల సమయంలో బాధితురాలి ఇంటికి వెళ్లిన షారుక్,.... ఆమెపై కూరగాయలు తరిగే కత్తితో దాడి చేశారు. అడ్డువచ్చిన వాచ్‌మెన్‌ను కత్తితో బెదిరించి పరారయ్యాడు.
షారుఖ్ సల్మాన్‌ను స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. బాధితురాలు గచ్చిబౌలిలో ఐటి ఉద్యోగినిగా పని చేస్తోంది. తన కుమార్తెను షారుఖ్ సల్మాన్ వేధిస్తున్నాడంటూ షీ టీమ్స్‌కు యువతి తండ్రి గతంలోనే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు.
ఇదీ చదవండి: మూడేళ్ల చిన్నారిని భవనంపై నుంచి తోసేసిన పిన్ని