Chits Fraud in AP:అమాయకులకు చిట్టీల పేరుతో వల విసిరి వారి నుంచి రూ.20 కోట్ల వరకూ దండుకుంది ఏపీలోని అనంతపురానికి చెందిన ఓ మహిళ. చేసేది చిరు వ్యాపారం.. కానీ చిట్టీల పేరుతో కోట్లకు కోట్లు వసూలు చేసింది. మధ్యతరగతి మహిళలే లక్ష్యంగా చేసుకుని నిట్ట నిలువునా మోసం చేసిందని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతపురం నగరంలోని విద్యుత్ నగర్‌కు చెందిన జయలక్ష్మి అనే మహిళ బ్యూటీపార్లర్ నడుపుతోంది. ఇరుగుపొరుగును మచ్చిక చేసుకుంటూ వారికి మాయమాటలు చెబుతూ చిట్టీలు వేయించింది. అలా అందరికీ నమ్మకం రావడంతో కూతురు పెళ్లికని ఒకరు.. కుమారుడి ఉన్నత చదువుల కోసమని మరొకరు.. సొంతిల్లు కట్టుకోవాలని ఇంకొందరు అమాయకులు జయలక్ష్మి దగ్గర చిట్టీలు వేశారు. ఇలా బాధితుల నుంచి దాదాపు 20 కోట్ల రూపాయలు వసూలు చేసుకుని ఉన్నపళంగా నిందితురాలు జయలక్ష్మి ఇంటిని ఖాళీ చేసి వెళ్తుండగా.. బాధితులు వెంబడించి ఎస్.కె.యూనివర్సిటీ వద్ద ఉన్న ఇటుకలపల్లి పోలీసు స్టేషన్లో అప్పగించారు.