పిల్లలు సరైన మార్గంలో వెళ్తున్నారా..? లేదా..? అనేది ముందుగా గుర్తించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. వాళ్ల ప్రవర్తనలో ఏమైనా తేడాలు ఉంటే గుర్తించడం వ్యసనాలకు బానిస అవుతున్నాడా అనేది ప్రాథమిక స్థాయిలోనే నిర్ధరణకు వచ్చి అదుపు చేయగలిగాలి. ఏది మంచి.. ఏది చెడు.. చెప్పి సరిదిద్దాలి. తల్లిదండ్రులు కూడా ఎంతమేరకు వారి సంతానాన్ని దారిలో పెడుతున్నారనే చర్చ జరుగుతోంది. 'పుడింగ్ అండ్ మింక్' పబ్ వ్యవహారమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. మావాడు మంచోడు, పబ్‌కు వెళ్తే తప్పేంటని కొందరు ఎదురు ప్రశ్నిస్తున్నారు. తప్పుదారిలో నడుస్తున్న పిల్లలను వెనకేసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, సూర్యాపేట జిల్లాలో మాత్రం ఓ తల్లి తన కుమారుడు మత్తుమందుకు బానిస అవుతున్నాడని తెలిసి కఠినంగా శిక్షించింది.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం గాంధీనగర్‌కు చెందిన ఓ 15ఏళ్ల బాలుడు పాఠశాల బంద్ చేసి.. మత్తు పదార్థాలకు బానిస అయ్యాడు. చెడు అలవాట్లు, చెడు స్నేహితుల కారణంగా గంజాయి సేవించడం అలవాటు చేసుకున్నాడు. వ్యవనానికి గురైన బాలుడు.. తల్లి ఎంత చెప్పినా వినలేదు. కుమారుడు కళ్ల ముందే చెడిపోతున్నా... తల్లిదండ్రులు ఏమిచేయలేని పరిస్థితి. ప్రతిరోజు మత్తుతో ఇంటికి వచ్చిన కుమారుడికి మంచి మాటలు చెప్పిన ఎక్కకపోవడంతో.. ఆగ్రహించిన తల్లి... స్తంభానికి కట్టేసింది. కొడుకును ఎలాగైనా దారికి తేవాలని మత్తుపదార్థాలు మానాలని కన్నీళ్లు దిగమింగుతూ.. కళ్లలో కారం పోసి.. దేహశుద్ధి చేసింది. మత్తు పదార్థాలు మానేస్త అని కుమారుడు మాట ఇవ్వడంతో.. కన్న పేగు విడిచి పెట్టింది. కుమారుడికి చికిత్స అందించి.. స్నానం చేయించి.. గుండెలకు హత్తుకుందా తల్లి.
గంజాయికి బానిసైన బాలుడిని.. తల్లి శిక్షిస్తున్న దృశ్యాలు చుట్టుపక్కల వాళ్లు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.. వైరల్‌గా మారాయి. కుమారుడిని సరైన మార్గంలో పెట్టేందుకు విధించిన దండనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. కొంత మంది మాత్రం... బిడ్డకు నచ్చజెప్పుకోవాలి కాని... అంత కఠినంగా ప్రవర్తించకూడదని అంటున్నారు.