పాఠశాల బస్సును లారీ ఢీకొనడంతో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషంగా ఉంది. ఈ ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బెండరా సమీపంలో చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆసిఫాబాద్ ప్రభుత్వాస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించిన విద్యార్థిని మంచిర్యాలకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది విద్యార్థులు ఉన్నారు.
ఆసిఫాబాద్‌లోని సెయింట్ మేరీ పాఠశాలకు చెందిన బస్సును లారీ ఢీ కొట్టింది. పాఠశాల బస్సు విద్యార్థులతో వాంకిడి వైపు వస్తుండగా బెండరా సమీపంలోకి రాగానే.. ఎదురుగా అతి వేగంగా లారీ రావడంతో బస్సు డ్రైవర్ అప్రమత్తమై బస్సును రోడ్డు కిందకు దించాడు. అయినప్పటికీ లారీ బస్సు వెనుక భాగంలో ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో వెనక సీట్లో కూర్చున్న నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఒకరి పరిస్థితి విషమం:ఈ ప్రమాదంలో నాలుగో తరగతి విద్యార్థులైన పులగం సతీష్, గంగిశెట్టి కార్తీక్, మిట్ట విష్ణు, పులగం సహస్రిత్ తలలకు గాయాలయ్యాయి. గాయ పడిన పిల్లలు అసిఫాబాద్ మండలం భీంపూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వారిలో సహస్రిత్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. అనంతరం మిగతా ముగ్గురు పిల్లలను కూడా మంచిర్యాకే తీసుకొచ్చారు. ప్రమాద విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆస్పత్రిలో రోదనలతో మిన్నంటాయి. కొంతమంది ఘటనా స్థలానికి వచ్చి తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు.
లారీని పట్టుకున్న పోలీసులు: ప్రమాద సమయంలో బస్సులో వాంకిడి, ఖమాన, భీంపూర్కు చెందిన 46 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు పరిమితికి మించి విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు డ్రైవర్ తెలిపిన వివరాల ఆధారంగా వాంకిడి పోలీసులు రెబ్బెన మండలం గోలేటి వద్ద లారీని పట్టుకున్నారు. లారీ డ్రైవర్ బండి తులసి రామును పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాఠశాల యజమాన్యం నిర్లక్ష్యం:ఓకే రూటులో రెండు పాఠశాల బస్సులను నడపాల్సి ఉండగా ఒకటే నడిపిస్తూ పరిమితికి మించి విద్యార్థులను బస్సు తరిలిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల పట్ల పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. బస్సు ఫీజులు మాత్రం అధికంగా వసూలు చేస్తూ ఇలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చూడండి:Old Women Died: వైకాపా నేతల దాడి.. వృద్దురాలు మృతి
ప్రాణాలు తీసిన వాట్సాప్ స్టేటస్.. ఎలా అంటే?