తెలంగాణ

telangana

ETV Bharat / crime

కూతురి మృతితో తల్లిదండ్రుల రోదన.. గ్రామస్థుల దాడితో మెట్టినింట ఉద్రిక్తత - ఉద్రిక్త వాతావరణం

అప్పగింతలప్పుడు పెట్టుకున్న కన్నీటి చారలు ఆరకముందే.. ఆ తల్లిదండ్రులకు కంటికేడు దారలు పడ్డాయి. మంచిగా చూసుకొమ్మని అప్పజెప్పిన అల్లుడే అమ్మాయి పాలిట యముడయ్యాడని తెలిసి.. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పెళ్లి చేసి పంపిన నెల రోజులకే అమ్మానాన్నలకు కడుపుకోత మిగిల్చిన ఆ మెట్టినింటిపై గ్రామస్థులు, బంధువులు.. దాడికి దిగారు. పోలీసులు, ఆందోళనకారులు, వాగ్వాదం, తోపులాట, రాళ్లదాడితో.. ఉద్రిక్త వాతావరణమే ఏర్పడింది.

300 villagers attack on bride groom house at kamareddy
300 villagers attack on bride groom house at kamareddy

By

Published : Sep 26, 2021, 7:58 PM IST

హైదరాబాద్ ప్రగతినగర్​లో జరిగిన నవదంపతుల ఘటన(husband murdered wife) ప్రభావం కామారెడ్డిలోని శ్రీరాంనగర్​ కాలనీపై పడింది. సుమారు 300 మంది ఆందోళనతో కాలనీ దద్దరిల్లిపోతోంది. వాళ్లను కట్టడి చేసేందుకు భారీ సంఖ్యలో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళన కారులకు పోలీసులకు మధ్య తోపులాట, ఇళ్లపై రాళ్ల దాడితో కాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పెళ్లైన నెల రోజులకే భార్యపై అనుమానంతో గొంతు కోసి హత్య(husband murdered wife) చేసిన ఘటన పరిణామంలో భాగమే పైన చెప్పిన ఉద్రిక్తత. నిందితుడు కిరణ్​ ఇళ్లు... కామారెడ్డిలోని శ్రీరాంనగర్​లో ఉంటుంది. విషయం తెలియగానే.. సుధారాణి సొంత గ్రామామైన తిమ్మాపూర్​కు చెందిన సుమారు 300 మంది గ్రామస్థులు, బంధువులంతా.. పట్టణంలోని శ్రీరాంనగర్​కు చేరుకున్నారు. కాలనిలో ఉన్న కిరణ్ ఇంటిముందు ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేస్తూనే ఉన్నారు.

గ్రామస్థుల ఆగ్రహాన్ని కట్టడి చేయలేక..

అమ్మాయి తరఫు బంధువులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున కామారెడ్డికి చేరుకున్నారన్న విషయం తెలియగానే.. హుటాహుటిన పోలీసులు రంగంలోకి దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. "మాకు న్యాయం కావాలి" అంటూ నిందితుని ఇంటి గేటుకు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో ఉన్న కూతురును చూసుకుంటూ.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎంతో గారాబంగా పెంచిన కూతురుని తలుచుకుంటూ.. ఆ అమ్మానాన్నలు గుండెలు బాదుకుంటున్న దృశ్యం.. ఆ గ్రామస్థులు, బంధువుల ఆగ్రహాన్ని రెట్టింపు చేశాయి. కోపంతో ఊగిపోతూ.. ఇంటి గేటును తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వాళ్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే గ్రామస్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమను అడ్డుకుంటున్నారన్న కోపంతో గ్రామస్థులు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను బయటకు లాగేశారు. కొందరు మహిళలు రాళ్లతో ఇంటిపై దాడి చేశారు. ఈ పరిణామాలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అనుమానమే పెనుభూతమై..

కామారెడ్డిలోని శ్రీరాంనగర్​కు చెందిన కిరణ్​కు దేవునిపల్లికి చెందిన సుధారాణికి గత నెల 28న వివాహమైంది. హైదరాబాద్‌ బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్‌లోని ద్వారకా అపార్ట్​మెంట్​లో నవదంపతులు నివాసముంటున్నారు. పెళ్లైన వారం నుంచి సుధారాణిపై అనుమానంతో కిరణ్​ ఆమెను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడు. అనుమానమే పెనుభూతమై.. భర్తను రాక్షసున్ని చేసేసింది. విచక్షణ కోల్పోయిన కిరణ్​.. శనివారం రోజున భార్యను గొంతు కోసి(husband murdered wife) చంపాడు. అనంతరం తానూ.. చేయి కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

ఒంటి నిండా కత్తిగాట్లతో.. రక్తపు మడుగులో..

సాయంత్రం సుధా తల్లిదండ్రులు.. కుమార్తె నివాసం ఉంటున్న అపార్ట్​మెంట్‌కు వచ్చారు. లోపలివైపు గడియ పెట్టి ఉండటం గమనించారు. వెంటనే అనుమానం వచ్చిన సుధా తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి తలుపులు తెరిచి చూడగా... సుధా శరీరం నిండా కత్తితో కోసిన గాయాలతో.. రక్తపు మడుగులో పడి ఉంది. అప్పటికే ఆమె మృతి చెందింది. కిరణ్ ఒంటి మీదా కత్తి గాయాలున్నాయి. సుధా మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కిరణ్ ప్రస్తుతం నిజాంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కూతురి తల్లిదండ్రుల రోధన.. 300 మంది గ్రామస్థుల ఆగ్రహ దాడి.. మెట్టినింట ఉద్రిక్తత

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details