కొవిడ్ మహమ్మారి ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేస్తోంది. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మొగలిమడకలో ఒకే కుటుంబంలో ముగ్గురు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గ్రామానికి చెందిన భద్రయ్య స్వామి, ఆయన కుమారుడు శంబులింగం ఆర్ఎంపీలుగా సేవలు అందిస్తుండేవాళ్లు. కొవిడ్ బారిన పడిన శంభులింగం... మే 24న మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. ఆయన తండ్రి భద్రయ్య స్వామి, తల్లి శశికళకు కరోనా పాజిటివ్‌గా తేలటం వల్ల... మే 30న ఆసుపత్రికి తరలించారు.
Corona Death: ఒకరి తర్వాత ఒకరు.. ఒకేరోజు ముగ్గురు మృతి - మొగలిమడకలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
తెల్లవారుజామున తల్లి.. తెల్లారాక కుమారుడు.. మధ్యాహ్నం తండ్రి..! ఇలా... ఒకరి మరణ వార్త విని జీర్ణించుకునేలోపే... మరొకరిని మింగేసిన కరోనా మహమ్మారి. ఒకే రోజున.. ఒకటే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడటం వల్ల ఆ గ్రామంలో విషాదఛాయలు నిండాయి. ఈ విషాదకర ఘటన.. నారాయణపేట జిల్లా మొగలిమడకలో జరిగింది.
చికిత్స పొందతూ శశికళ.. ఇవాళ తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోగా... కుమారుడు ఉదయం తొమ్మిదిన్నర సమయంలో తుదిశ్వాస విడిచారు. ఇద్దరి మృతదేహాలకు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ విషాదం నుంచి కోలుకోకముందే తండ్రి భద్రయ్యస్వామి కూడా... సాయంత్రం మూడున్నర ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబంలో ఒకే రోజు.. ముగ్గురు మృత్యువాత పడటం... గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. భద్రయ్య స్వామికి ముగ్గురు కుమారులు, కూతురు ఉండగా అందరికీ వివాహాలు అయ్యాయి. కుమారుడు శంభులింగానికి భార్య, ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల కూతురు ఉన్నారు.