Honor killing case: హైదరాబాద్ బేగంబజార్ నీరజ్ పన్వార్ హత్య కేసులో అరెస్ట్ అయిన నలుగురు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇవాళ కోర్టులో హాజరుపర్చగా... కోర్టు వారికి 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టులో హాజరుపరిచే ముందు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం విచారణ జరిపిన కోర్టు... నిందితులకు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ముగ్గురు నిందితులు విజయ్, సంజయ్, రోహిత్‌లను చంచల్ గూడ జైలుకు తరలించారు. మైనర్ బాలుడిని జువెనైల్ హోంకు తీసుకెళ్లారు. మరోవైపు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అభినందన్‌తో పాటు మహేశ్ కోసం మూడు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
అసలేం జరిగిందంటే..అఫ్జల్‌గంజ్ పరిధిలోని కోల్సావాడిలో నివాసముండే నీరజ్ పన్వార్ బేగంబజార్‌లో తండ్రి రాజేందర్నాథ్తో కలిసి వేరుశనగ గింజల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. అదే ప్రాంతంలో నివాసం ఉండే సంజనతో నీరజ్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గతేడాది పాతబస్తీలోని గణేశ్టెంపుల్లో వారు వివాహం చేసుకున్నారు. అప్పటివరకు వీరి ప్రేమ వ్యవహారం తెలియకపోవడం.. అకస్మాత్తుగా పెళ్లి చేసుకోవటంతో యువతి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయి కుటుంబసభ్యుల నుంచి ప్రాణభయం ఉందంటూ నవదంపతులు అఫ్జల్‌గంజ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. మేజర్లు కావటంతో పోలీసులు కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపగా 'నీరజ్-సంజన' కలిసి జీవనం సాగిస్తున్నారు. రెండు నెలల క్రితం వారికి బాబు జన్మించాడు. అప్పటికే నీరజ్‌పై కక్ష పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు ఎలాగైనా హతమార్చాలని పథకం వేశారు.