Kirti missing case in Bhadrachalam: తల్లిదండ్రులు చదువుకోమ్మని మందలించినందుకు ఓ విద్యార్థిని ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైన ఘటన భద్రాచలంలో జరిగింది. గత నెల 31న అమ్మనాన్నల మీద కోపంతో భద్రాచలంలోని కొర్రాజులగుట్ట కాలనీకి చెందిన 'శంకర్-సృజన' దంపతుల కుమార్తె కీర్తి.. ఇంటి నుంచి అలగి వెళ్లిపోయింది. 18 రోజులుగా బిడ్డ తిరిగి రాకపోవటంతో కన్నవారు కన్నీరుమున్నీరవుతున్నారు. పదో తరగతి చదువుతున్న కీర్తి.. తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయిందని దగ్గరివారు అంటున్నారు.
బిడ్డ కోసం పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్ల వద్ద వెతికిన తల్లిదండ్రులు.. ఎక్కడా ఆచూకీ లేకపోవటంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. సీసీ కెమెరాల ఆధారంగా కీర్తి.. భద్రాచలం నుంచి విజయవాడ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో తెలియక పోవటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. బిడ్డకోసం కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్న దంపతులు.. తమ బిడ్డ ఆచూకీ చెప్పాలని వేడుకుంటున్నారు.