సంచలనం రేపిన తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల స్వాహా (TELUGU ACADEMY FD SCAM )కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇప్పటి వరకు మూడు కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు జరిపిన సీసీఎస్ పోలీసులు పది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బ్యాంకు ఏజెంట్లతో కుమ్మకై అకాడమీ అకౌంట్స్ ఇంఛార్జి రమేశ్, బ్యాంకు అధికారులు కోట్ల రూపాయల అకాడమీ నిధులను తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్టు గుర్తించారు. స్వాహా చేసిన నిధులతో కొందరు ఆస్తులు కొనుగోలు చేయగా.. మరికొందరు వడ్డీ వ్యాపారం మొదలు పెట్టారు. పాత నేరస్తుడు సాయికుమార్ ఈ వ్యవహారంలో తెర వెనుక ఉండి మొత్తం కథ నడిపించాడు. కొల్లగొట్టిన నగదులోనూ అధిక శాతం ఇతనే తీసుకున్నట్టు పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈ కేసులో మొత్తం 64.5 కోట్లు నిధులు గోల్‌మాల్ అయినట్లు గుర్తించామని సీపీ తెలిపారు.
అరెస్టయిన వారిలో అకాడమీ అకౌంట్స్ ఇంఛార్జి అధికారి రమేశ్, చందానగర్ కెనరా బ్యాంకు మేనేజర్ సాధన, స్థిరాస్తి వ్యాపారులు సాయికుమార్, సోమశేఖర్, వెంకటేశ్వర్‌రావు, వెంకటరామన్, యూబీఐ మేనేజర్ మస్తాన్‌వలీ, మర్కంటైల్ సహకార సంఘం ఛైర్మన్ సత్యనారాయణ రావు, ఆపరేషనల్ మేనేజర్ పద్మావతి, మోహియుద్దీన్లు ఉన్నారు.
నకిలీ పత్రాలతో కాజేశారు..
పశ్చిమ గోదావరికి చెందిన వెంకటరామన్ స్థిరాస్తి వ్యాపారం చేస్తుండేవాడు. పెట్టుబడులు పెట్టేందుకు డబ్బు అవసరం రావడంతో సాయికుమార్‌తో కలిసి బ్యాంకుల్లో ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లు కొల్లగొట్టాలని భావించారు. ఇందుకు సోమశేఖర్ సహకారం తీసుకున్నారు. సాయికుమార్ గతంలో ఏపీ మైనార్టీ సంక్షేమ సంఘం, ఏపీ హౌసింగ్ బోర్డు కుంభకోణం, చెన్నైలో మరో కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో తెలుగు అకాడమీకి అకౌంట్స్ (TELUGU ACADEMY FD SCAM )ఇంఛార్జి రమేశ్.. బ్యాంకు ఏజెంట్ సాయికుమార్‌కు పరిచయమయ్యాడు. అకాడమీకి చెందిన నిధులను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేందుకు సాయికుమార్‌కు చెక్కుల రూపంలో రమేశ్ ఇచ్చేవాడు. వాటిని తన అనుచరులతో కలిసి నకిలీ ఎఫ్‌డీఆర్ పత్రాలు సృష్టించి బ్యాంకులో డిపాజిట్ చేశామని నమ్మబలికేవారు. అయితే ఈ వ్యవహారమంతా రమేశ్‌కు ముందుగానే చెప్పి అతని కూడా కమీషన్ ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఉన్నతాధికారులకు తెలియకుండా రమేశ్ ఈ తతంగమంతా నడిపేవాడు. బ్యాంకు అధికారుల సహాయంతో నకిలీ డిపాజిట్ పత్రాలను సృష్టించి అకాడమీ ఉన్నతాధికారులకు చూపేవారు. వీరికి యూబీఐ బ్యాంకు మేనేజర్ మస్తాన్‌వలీ, కెనరా బ్యాంకు మేనేజర్ సహకరించారు. ఆ అధికారులకు కమీషన్లు ముట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది.
అకాడమీ అకౌంట్ల నుంచి వ్యక్తిగత ఖాతాల్లోకి..
కార్వాన్ యూబీఐ బ్యాంకు నుంచి రూ.26 కోట్లు, సంతోష్‌నగర్ యూబీఐ నుంచి రూ.11 కోట్లు, కెనరా బ్యాంకు నుంచి రూ.6 కోట్లు కొల్లగొట్టారు. మిగతా సొమ్ముకు సంబంధించి మరో ఎనిమిది మందిపై అనుమానం ఉందని వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తామన్నారు. ప్రస్తుతం అరెస్టయిన వారిని కస్టడీలోకి తీసుకొని మరిన్ని వివరాలు రాబడతామని సీపీ వివరించారు. బ్యాంకుల నుంచి ఎఫ్‌డీ విత్‌డ్రా తర్వాత ఆ సొమ్ము తమ ఖాతాల్లోకి మళ్లించడానికి మర్కంటైల్ సహకార సంఘాన్ని నిందితులు ఉపయోగించుకున్నారు. మర్కంటైల్ సహకారం సంఘం ఛైర్మన్ సత్యనారాయణరావుకు విషయం చెప్పి పదిశాతం కమీషన్ ఇస్తామన్నారు. ఇందుకు మేనేజర్ పద్మావతి, మోహియుద్దీన్ సహకరించారు. మళ్లించిన సొమ్మును తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకోవడానికి మర్కంటైల్ సహకార సంఘానికి ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ లేకపోవడంతో.. ఆ డబ్బును అగ్రసేన్ బ్యాంకులోకి మళ్లించారు. ఇందుకోసం అగ్రసేన్ బ్యాంకులో అకాడమీ అవసరాల కోసమని ఖాతాలు తెరిచారు. ఆ ఖాతాల నుంచి తమ వ్యక్తిగత ఖాతాల్లోకి సొమ్మును మళ్లించుకొని ముఠాలో అందరూ పంచుకున్నారు.
ఈ కేసులో మరో 8 మంది అనుమానితులను విచారించి.. వారి ప్రమేయం ఉంటే అరెస్టు చేసే అవకాశం ఉంది. యూబీఐ సంతోష్‌నగర్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ మస్తాన్‌వలీని 6 రోజుల కస్టడీకి సీసీఎస్ పోలీసులు తీసుకున్నారు. ఎఫ్‌డీల కుంభకోణంలో ప్రశ్నించనున్నారు.
TELUGU ACADEMY FD SCAM: తెలుగు అకాడమీ కేసులో మొత్తం 10 మంది అరెస్టు ఇలా వెలుగులోకి వచ్చింది..
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ (Telugu Academy Case).. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు పంచాలంటూ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈనెల 28 లోపు తెలుగు అకాడమీ సిబ్బంది, చరాస్తులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంది. రాష్ట్ర విభజన నాటికి అకాడమీ వద్ద ఉన్న రూ.213 కోట్లను అధికారులు పలు బ్యాంకు శాఖల్లో డిపాజిట్ చేశారు. నిధులను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 58: 42 నిష్పత్తిలో పంచుకోవాలి. ఆ ప్రకారం ఏపీకి రూ.124 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో .. భవనాలు, నగదు వివరాలను లెక్కిస్తుండగా.. వివిధ బ్యాంక్‌లతో పాటు యూబీఐ కార్వాన్, సంతోష్‌నగర్ శాఖల్లో రూ.43 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లున్నాయని(fixed deposits) తేలింది. గడువు తీరకముందే వాటిని తీసుకోవాలని అకాడమీ అధికారులు నిర్ణయించారు. ఈనెల 21న డిపాజిట్ పత్రాలు బ్యాంకుకు చేరినా అటువైపు నుంచి సమాచారం లేకపోవడంతో మూడు రోజుల తర్వాత తెలుగు అకాడమీ ఉద్యోగి రఫీక్ నేరుగా బ్యాంకుకు వెళ్లారు. ఆగస్టులోనే రూ.43 కోట్లు విత్‌డ్రా అయ్యాయని బ్యాంకు అధికారులు తెలిపారు. నిగ్గు తేల్చాలని అకాడమీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీచూడండి:Telugu Academy Case: అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కుంభకోణంలో పురోగతి