తెలంగాణ

telangana

ETV Bharat / city

మినీ పురపోరులో తెరాస పకడ్బందీ వ్యూహం - మినీపురపోరు

పుర పోరు నామినేషన్ల పర్వంలోనే తెరాస పకడ్బందీ వ్యూహం అమలు చేసింది. వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్‌ పురపాలక సంఘాలకు ఈ నెల 30న ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. ఖమ్మం మినహా ఇతర నగర, పురపాలికల్లో తెరాస ఒంటరిగా పోటీ చేస్తోంది. ఖమ్మంలో సీపీఐతో పొత్తు కుదుర్చుకుంది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యేసరికి వరంగల్‌లో కొంత అసమ్మతి బెడద ఉన్నా మిగిలినచోట్ల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడింది.

trs strategy in mini municipal elections
trs strategy in mini municipal elections

By

Published : Apr 23, 2021, 4:47 AM IST

Updated : Apr 23, 2021, 6:36 AM IST

మినీ పురపోరులో తెరాస పకడ్బందీ వ్యూహం

మినీపురపోరులో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగియడంతో బరిలో నిలిచే అభ్యర్థుల లెక్కతేలింది. ఆయా పార్టీల నుంచి పోటీచేసే అభ్యర్థులు ప్రచారపర్వంలోకి దిగారు. నామపత్రాల ఉసంహరణ ప్రక్రియ ముగిశాక...వరంగల్‌లో తెరాస 66 డివిజన్లలో పోటీ చేస్తోంది. పార్టీ టికెట్లకు తీవ్రమైన పోటీ ఏర్పడగా...పెద్దఎత్తున నామినేషన్లు వేశారు. మంత్రులతో ఏర్పాటుచేసిన సమన్వయ కమిటీ అందరితోనూ చర్చించి ఎక్కువ మందిని ఉపసంహరింపజేసింది. కొందరు ససేమిరా అన్నా...తెరాస అభ్యర్థులు ఇతర పార్టీల వైపు చూడకుండా కమిటీ చివరిరోజు బీఫారాలు అందజేసింది. ఉపసంహరణ అనంతరం పదిచోట్ల అసమ్మతి సమస్య ఉంది. గత పాలకవర్గంలో తెరాసకు 53 మంది కార్పొరేటర్లు ఉండగా.. 24 మందికి మాత్రమే తిరిగి టికెట్లిచ్చింది.

ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో 60 స్థానాలకు గాను 57 స్థానాల్లో తెరాస, మూడింట సీపీఐ బరిలో ఉన్నాయి. పదో డివిజన్‌లో మిగిలిన అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో తెరాస అభ్యర్థి ఏకగీవ్రం కానున్నారు. మిగిలిన 56 స్థానాలకు రెండు మూడు చోట్ల తిరుగుబాటుదారుల సమస్య ఉంది. గత పాలకవర్గంలో 43 మంది తెరాస కార్పొరేటర్లుండగా వారిలో 21 మందికి పార్టీ టికెట్లిచ్చింది. సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్‌లలో అధికార పార్టీ నేతలు సమయస్ఫూర్తితో తిరుగుబాటుదారుల బెడదను నివారించారు.

రాష్ట్రంలో మినీ పురపాలక ఎన్నికల్లో ఖమ్మంలో వివిధ పార్టీలు పొత్తులతో బరిలో దిగగా వరంగల్‌ కార్పొరేషన్, మరో ఐదు మున్సిపాలిటీల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు అచ్చంపేట, సిద్దిపేట, కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్‌ మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గురువారంతో ముగిసింది. ఖమ్మం కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు గాను పదో డివిజన్‌ను తెరాస ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఈ కార్పొరేషన్‌లో తెరాస సీపీఐతో కాంగ్రెస్‌.. సీపీఎంతో, భాజపా.. జనసేనతో కలిసి బరిలో దిగాయి. తెరాస 57 డివిజన్లలో, సీపీఐ మూడు స్థానాల్లో అభ్యర్థులను నిలిపాయి. కాంగ్రెస్‌ 48 స్థానాల్లో, సీపీఎం 9 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. భాజపా 47 చోట్ల జనసేన ఐదుచోట్ల అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. తెలుగుదేశం ఎనిమిది డివిజన్లలో అభ్యర్థులను బరిలో నిలిపింది.

వరంగల్‌ కార్పొరేషన్‌లో ఎలాంటి పొత్తులు లేకుండానే తెరాస, కాంగ్రెస్, భాజపా బరిలో దిగాయి. మొత్తం 66 డివిజన్లలోనూ తెరాస, భాజపా అభ్యర్థులను నిలిపాయి. కాంగ్రెస్‌ 65 చోట్ల పోటీ చేస్తూ ఒక డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. సీపీఎం 14 డివిజన్లలో, సీపీఐ ఏడింటిలో, తెలుగుదేశం 14 చోట్ల, ఎంఐఎం నాలుగు చోట్ల, జనసేన, వైకాపా 4 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

సిద్దిపేటలో 43 డివిజన్లు ఉండగా తెరాస అన్ని స్థానాల్లో పోటీలో ఉండగా కాంగ్రెస్‌ అభ్యర్థులు 30 స్థానాల్లో ఉన్నారు. ఇక్కడ ఒక వార్డులో బీఫాం పొందిన కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. భాజపా 40 చోట్ల, ఎంఐఎం నాలుగు చోట్ల, సీపీఐ, సీపీఎంలు చెరో స్థానంలో అభ్యర్థులను నిలిపాయి. అచ్చంపేటలో 20 వార్డుల్లోనూ తెరాస, కాంగ్రెస్, భాజపా అభ్యర్థులు బరిలో ఉన్నారు. నకిరేకల్‌లో 20 వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు 16 చోట్ల పోటీ చేస్తున్నారు. తెరాస అన్నింటా, భాజపా 14, సీపీఎం 3చోట్ల పోటీ చేస్తున్నాయి. జడ్చర్లలోని 27 వార్డుల్లోనూ తెరాస అభ్యర్థులు బరిలో ఉండగా కాంగ్రెస్‌ 25 స్థానాల్లో, భాజపా 22 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎంఐఎం ఏడు చోట్ల, సీపీఐ మూడు స్థానాల్లో, సీపీఎం ఒకచోట అభ్యర్థులను నిలిపాయి. కొత్తూరులో 12 వార్డులు ఉండగా అన్ని స్థానాల్లో తెరాస, కాంగ్రెస్, భాజపా అభ్యర్థులు ఉన్నారు.

ప్రస్తుత కార్పొరేటర్లు, కౌన్సిలర్లపై వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకొని సగం మందికి పైగా టికెట్లను అధికార పార్టీ నిరాకరించింది.

ఇదీ చూడండి:రాష్ట్రంలో యథావిధిగా మినీ పురపోరు

Last Updated : Apr 23, 2021, 6:36 AM IST

ABOUT THE AUTHOR

...view details