ప్రభుత్వ తీరును నిరసిస్తూ... రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. తమపై ఆటవీశాఖ అధికారులు దాడులు జరుపుతుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తెలంగాణ విశ్వబ్రాహ్మణుల సంఘం మండిపడింది. వరంగల్ జిల్లా మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న వడ్రంగుల ఇళ్లపై అటవీశాఖ, పోలీసులు దాడులు చేసి కట్టె మిషిన్లను తీసుకెళ్లారని దుయ్యబట్టారు.
ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ.. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ ఎదుట విశ్వ బ్రాహ్మణులు ఆందోళన చేపట్టారు. దాడులను తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేశారు. అసలైన కలప స్మగ్లర్లను వదిలిపెట్టి తమపై దాడులు చేయడం సరికాదన్నారు.
మరోవైపు వడ్రంగి కార్మికులపై వేధింపులకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లాలో సామిల్ యజమానులు బంద్కు దిగారు, హైదరాబాద్ గ్రేటర్ సిటీ టింబర్స్ మర్చంట్స్, సామిల్లర్స్ అసోసియేషన్ మూడు రోజుల బంద్కు దిగి బేగంబజార్లో ధర్నా నిర్వహించారు. జీవో నెం.55 వలన అనేకమంది చేతివృత్తి కళాకారులు జీవనోపాధి కోల్పోయారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో రద్దు చేసి టింబర్ పరిశ్రమను ఆదుకోవాలని కోరారు.