తెలంగాణ

telangana

ETV Bharat / city

వాకింగ్​కు వెళ్తున్నారా... జేబులో వెయ్యి పెట్టుకెళ్లండి! - సిటీ కాలనీ ఇండోర్‌ స్టేడియం

మార్నింగ్‌ వాకింగ్‌కు వస్తే రూ.వెయ్యి ఇవ్వాల్సిందే. డబ్బులు చెల్లించి రసీదు చూపిస్తేనే ప్రవేశం. లేదంటే లోపలకు రావద్దంటున్నారు. వరంగల్‌ ఓ సిటీ కాలనీ ఇండోర్‌ స్టేడియంలో అభివృద్ధి కమిటీ పేరుతో అనధికారికంగా నగదు వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకు వసూలు చేస్తున్నారు? ప్రభుత్వ శాఖాధికారుల అనుమతితోనే చేస్తున్నారా? అని ఎవరైనా అడిగితే స్టేడియం అభివృద్ధి పనుల కోసమంటున్నారు.

morning walk, thousand rupees
morning walk in warangal

By

Published : Mar 26, 2021, 8:02 AM IST

వరంగల్​ పట్టణంలోని కాశీబుగ్గ, సొసైటీ కాలనీ, లేబర్‌కాలనీ, చింతల్‌, పుప్పాలగుట్ట, గిర్మాజిపేట తదితర ప్రాంతాల నుంచి వందలాది మంది ప్రతిరోజూ ఉదయం ఓ సిటీ కాలనీకి వస్తారు. ఇండోర్‌ స్టేడియంతో పాటు అజంజాహిమిల్లు గ్రౌండ్‌లో వాకింగ్‌ చేస్తారు. క్రికెట్‌ ఆడేందుకు యువకులు సైతం వస్తారు. స్టేడియంలోకి వచ్చే ప్రతి వ్యక్తి రూ.1000 చెల్లించాలని షరతు పెట్టారు. రోజూ వందల సంఖ్యలో వాకర్లు, పదుల సంఖ్యలో క్రికెట్‌ ఆటగాళ్లు ఇక్కడకు వస్తుంటారు. నాలుగైదు నెలలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఓ సిటీ స్టేడియం అభివృద్ధి కమిటీ పేరుతో రసీదు ఇస్తున్నారు. ఇటీవల స్టేడియంలో మొరం(మట్టి) పోయించారు, వ్యాయామం కోసం బార్‌ ఏర్పాటు చేశారు.

వాస్తవంగా పరిశీలిస్తే కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) ఆధ్వర్యంలో ఓ సిటీ లేఅవుట్‌ కాలనీ ఏర్పడింది. వరంగల్‌ ప్రాంతంలో అత్యంత ఖరీదైన స్థలాలుగా గుర్తింపు ఉంది. ఇండోర్‌ స్టేడియం కోసం సుమారు ఎకరం స్థలాన్ని కేటాయించారు. జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది. ప్రభుత్వ శాఖ నిధులతో స్టేడియం అభివృద్ధి చేస్తే ప్రైవేటుగా నగదు వసూలు చేయడాన్ని చాలామంది తప్పుపడుతున్నారు. ఇంత మొత్తం చెల్లించలేక వాకింగ్‌కు రావడం మానేశారు. కొంతమంది వ్యతిరేకించినప్పటికీ ఎందుకొచ్చిన తంటా అని వాకర్స్‌, క్రికెట్‌ ఆడే యువకులు రూ.వెయ్యి చొప్పున చెల్లించారు. ఇప్పటికే రూ.లక్షల్లో చేసిన ఈ అనధికార వసూళ్లపై కొంత మంది వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

మా దృష్టికి రాలేదు: మర్రి యాదవరెడ్డి, ‘కుడా’ ఛైర్మన్‌

ఓ సిటీలో జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఇండోర్‌ స్టేడియం అభివృద్ధి పనులు జరిగాయి. ‘కుడా’ నుంచి స్థలాన్ని కేటాయించాం. ప్రభుత్వ నిధులతోనే పనులు చేపట్టారు. మార్నింగ్‌ వాకర్స్‌ దగ్గర వేయి చొప్పు నగదు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. డబ్బులు ఎవరు వసూలు చేస్తున్నారో విచారణ చేపడతాం. జిల్లా క్రీడల శాఖాధికారి దృష్టికి తీసుకెళ్తాను.

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరోమారు భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details