మేడారం జాతర - ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు
అరణ్యంలో కొలువైన వనదేవతలు జనం మధ్యకు విచ్చేసే శుభ సమయం దగ్గరికొచ్చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మేడారం జాతర జరగనుంది. కోటిమందికి పైగా భక్తజనం...గద్దెలపైన కొలువైన తల్లులకు పూజలు చేస్తారు. బెల్లంతో మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం పరిసరాలు భక్త జనసంద్రమవుతాయి. ఇసుకెస్తే రాలనంత మంది జనంతో జంపన్నవాగు కిటకిటలాడుతుంది. అందుకే ఈ జన జాతరను తెలంగాణ కుంభమేళాగా కూడా పేర్కొంటారు.
రూ. 75 కోట్లు మంజూరు
మేడారం జాతరకు చేయాల్సిన ఏర్పాట్లపై మంత్రులు, అధికారులు ఇప్పటికే పలుమార్లు సమీక్షలు జరిపారు. 75 కోట్ల రూపాయలు మంజూరు కాగా... పనులన్నీ జనవరి 15లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా.. ట్రైబల్ విలేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
"ప్రకృతిని కొలిచే వేడుకలో.. పర్యావరణానికి ఎటువంటి హానీ జరగకుండా జాతర నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది"