పుట్టి పెరిగిన ఊళ్లో.... తండ్రి పేరుతో నిర్మితమౌతున్న స్మృతి వనం... వారిద్దరికీ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసింది. ఒక్కసారిగా ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. పీవీ నరసింహరావు స్మృతివనం శంకుస్ధాపన కార్యక్రమంలో... ఆయన కుమార్తె సురభి వాణిదేవి, కుమారుడు ప్రభాకరరావు పాల్గొన్నారు. పీవీతో గడిపిన అనుభవాలను.. ఆయన చివరిమాటలను నెమరువేసుకున్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడమే కాకుండా... వంగరను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ..
పీవీ కుమార్తె సురభి వాణిదేవి మాట్లాడుతూ... ఇక్కడ అన్ని మేం ఆడుకున్న ప్రాంతాలే. మా బాల్యం అంతా ఇక్కడే గడిచిందని తెలిపారు. ''ఈ ఊరంటే నాకు ఎంతో ఇష్టం. నేను చాలా చాలా అదృష్టవంతురాలిని. ఇక్కడ పాఠశాలలలో ఐదో తరగతి చదువుకున్నాను. చిన్నప్పుడు ఇక్కడే పొలాల్లో, చెట్లలో, గుట్టల్లో ఆడుకునే వాళ్లం. ఇదే ఇంట్లో పుట్టాం. నా గురించి తెలియని వారెవరూ ఇక్కడ లేరు. ఇక్కడే చాలా పెయింటింగ్స్ వేశాను. వాటికి సారే జహాసే అచ్చా అని పేరు పెట్టా. వాషింగ్టన్ డీసీలో అవి ప్రచురితమైయ్యాయి. ఎక్కడ వంగర... ఎక్కడ వాషింగ్టన్ డీసీ.
పీవీ ఓ అద్భుతమైన వ్యక్తి. ఇక్కడ పుట్టి...పెరిగి... దేశానికి ప్రధానై... ఎర్రకోట మీద జెండా ఎగరేసిన వ్యక్తి పీవీ. పీవీ బిడ్డగా ఆయన గురించి గొప్పతనం గురించి ఎన్ని రోజులైనా చెపుతాను. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. మాకు ధైర్యం, భరోసా కల్పించింది ఆయనే. ఇప్పుడు ఈ ప్రాంతంలో పచ్చదనం వెల్లివిరిస్తోంది. పట్టణం కన్నా.. వంగరే బాగుందనే విధంగా అభివృద్ధి చేశారు. నాన్న వాడిన వస్తువులు... భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయ్. ఎమ్మెల్సీగా కాదు... వంగర వాస్తవ్యురాలిగా... పీవీ బిడ్డలుగా... ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నా'... అంటూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.