తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉపాధ్యాయుల ఉపాయం.. కరోనా కాలంలో ఉపాధి మార్గం! - దెబ్బకొట్టిన కరోనా

బడిలో పిల్లలకు పాఠాలు చెప్పి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే ఉపాధ్యాయులు.. కరోనా వైపరీత్యం వల్ల బతకడానికి పడరాని పాట్లు పడుతున్నారు. పాఠశాలలు తెరవక.. జీతాలు లేక.. ఉపాధి దొరకక.. బతుకు బండిని లాగడానికి ఉపాయాలు ఆలోచిస్తున్నారు. ఎలా బతకాలో చెప్పే బడిపంతుళ్లే.. ఇప్పుడు బతికేదెలా అంటున్నారు. కరోనా కాటుకు జంకకుండా.. ఉపాయంతో చిన్నాచితకా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

Private Teachers Set Alternate Employment In Corona Situation
ఉపాధ్యాయుల ఉపాయం.. కరోనా కాలంలో ఉపాధి మార్గం!

By

Published : Sep 19, 2020, 9:15 PM IST

చేతిలో ఉద్యోగం ఉండి.. నెల కాగానే.. ఠంచనుగా ఖాతాలో జీతం పడితేనే.. ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఒకరికి ఇచ్చి.. మరొకరికి వాయిదా వేసి.. తీర్చుకోవాలనుకున్న సరదాలు వాయిదా వేస్తూ మధ్య తరగతి జీవులు బతుకు బండిని ముందుకు లాక్కెళ్తుంటారు. అలాంటిది.. చేతిలో ఉన్న పని కోల్పోయి.. జీతమే రాకుంటే పూట గడిచేదెట్ల? జీవితం తలకిందులవుతుంది. కొవిడ్ మహమ్మారి కారణంగా చాలామంది ఉపాధి కోల్పోయి.. గడ్డు పరిస్థితిలో పడ్డారు. వేతనాలు లేక... ఆదాయం రాక... పడే వెతలు అన్నీఇన్ని కావు. అయినా ధైర్యం కోల్పోకుండా.. కరోనా తెచ్చిన కష్టాలకు ఎదురీది.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా జీవనాన్ని కొనసాగిస్తున్నారు వరంగల్​ జిల్లా ప్రైవేట్​ ఉపాధ్యాయులు. ఆత్మస్థైర్యంతో ఉంటే.. కరువునే కాదు.. కరోనాను కూడా గెలవచ్చని నిరూపిస్తున్నారు.

ఉపాధ్యాయుల ఉపాయం.. కరోనా కాలంలో ఉపాధి మార్గం!

ఆదాయ మార్గంకై.. అన్వేషణ!

పూలమ్మిన చోటే కట్టెలు అమ్మడమంటే ఏంటో.. కరోనా అందరికి అర్థమయ్యేలా చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా ఏడు నెలల నుంచి... ఉపాధి దొరకక.. చేతిలో చిల్లిగవ్వ లేక మధ్యతరగతి వర్గాలను కోలుకోలేని దెబ్బ తీసింది. నెల జీతం ఇంటి ఖర్చులకు సరిపోకున్నా... సర్దుకుపోవడం అలవాటే కాబట్టి... పెద్దగా కష్టం అనిపించలేదు. కానీ ఇప్పుడు జీతం లేక... దాచుకున్న కొద్దిపాటి డబ్బులు కూడా ఖర్చయిపోయి.. ప్రైవేటు ఉపాధ్యాయులు, ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇంటి కిరాయి, పాలు, కూరగాయలు, ఫీజులు... కరెంటు... ఇందులో ఏ ఖర్చు కూడా వాయిదా వేసేది కాదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక చాలామంది సతమతమౌతున్నారు. అయితే కష్టాలు మనిషిని బండబారుస్తాయనే మాట మరోసారి రుజువైంది. నెలసరి ఆదాయం రాకపోవడం వల్ల కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రత్యామ్నాయ ఆదాయమార్గాలు వెతుక్కుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.

కడుపు నింపుతూ..

వరంగల్​ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలానికి చెందిన సుమన్​, అవంతికలు భార్యాభర్తలు. కరోనా కంటే ముందు సుమన్​ హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో టీచర్​గా చేసేవారు. అవంతిక పోలీస్​ ట్రైనింగ్​ తీసుకునేది. కానీ.. కరోనా వారికి కష్టాలమూటను నెత్తిన ఎత్తింది. సుమన్​ ఉద్యోగం పోయింది. పాఠశాలలు తెరవక.. జీతాలు ఇవ్వక కుటుంబ పోషణ భారంగా మారింది. సొంతూరుకు తిరిగి వెళ్లిపోదామనుకున్నారు. కానీ.. ఉపాధి కోసం ఊరి వదిలి వచ్చి.. ఉపాధి కోల్పోగానే.. తిరిగి సొంతూరుకు వెళ్లడానికి మనసొప్పలేదు. ప్రత్యామ్నాయం ఆలోచించారు. జొన్నరొట్టెలు చేసి.. రోడ్డు పక్కన అమ్మడం మొదలుపెట్టారు. వచ్చిన ఆదాయంతో ఇబ్బందులు లేకుండా జీవిస్తున్నారు.

ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా..

దిల్లీలో సాఫ్ట్​వేర్ ఉద్యోగం చేసే... జిత్తెందర్​ది మరో కథ. కరోనా కారణంగా పరిస్ధితులు తారుమారై... ఉద్యోగం కోల్పోయాడు. చేతిలో చిల్లిగవ్వ లేక దిల్లీలో చాలా ఇబ్బందులు పడ్డాడు. వేరే ఏం ఆలోచించక హన్మకొండ వచ్చేశాడు. ఉన్న కొద్దిడబ్బుతో కర్రీపాయింట్​ పెట్టాడు. కరోనా కాలంలో మరో పదిమందికి ఉపాధినిచ్చాడు. నెలకు యాభై నుంచి అరవై వేలు సంపాదిస్తున్నాడు. కరోనా మహమ్మారి...తెచ్చిన కష్టం రాటుదేలేలా చేసిందని... ఎలాంటి పరిస్ధితుల్లో అయినా ఆత్మస్ధైర్యం వదలిపెట్టొద్దని చెప్తున్నాడు జితేందర్.

ప్రత్యామ్నయమే మార్గం..

నిన్నటిదాకా.. కళాశాలలో విద్యార్ధులకు పాఠాలు చెప్పిన లెక్చరర్ సుధాకర్. కరోనా వల్ల కళాశాలలు మూతపడ్డాయి. అడ్మిషన్లు లేవు. ఆన్​లైన్​లో పాఠాలు చెప్తే.. జీతాలు వస్తాయో రావో తెలియదు. ఉపాధి పోయింది. తన మీద ఆధారపడి ఓ కుటుంబం ఉంది. తనకు తానే ధైర్యం చెప్పుకొని అడుగు ముందుకేశాడు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టిసారించి.. హన్మకొండలో ఓ కిరాణా కొట్టు పెట్టుకొని బతుకుబండిని లాగుతున్నాడు.

బతికిస్తున్నారు..

కరోనా వల్ల చాలామంది ఉపాధి కోల్పోయి కష్టాలను దిగమింగి.. ఆత్మగౌరవాన్ని పక్కకు పెట్టి.. ఏదో ఒక ఉపాధి మార్గం వెతుక్కుంటున్నారు. టైలరింగ్, ట్రాలీలో పళ్లు అమ్ముకోవడం, రోడ్డు పక్క మిర్చీబండి ఇలా ఏదో ఒక పని చేస్తూ తాము బతుకుతూ కుటుంబాలను బతికించుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు పాఠాలు చెప్పిన బడిపంతుళ్లే కూలీలుగా.. మారి ఏదో ఒక పని చేసి బతుకుబండిని లాగుతున్నారు.

మంచిరోజులొస్తాయ్..

చేతిలో ఉన్న ఉపాధి కొల్లగొట్టిన కరోనా వైరస్​ మహమ్మారి కారణంగా ప్రపంచం తలకిందులైనా.. ఆ కోరల్లో పడి తల్లడిల్లకుండా వేరే పని వెతుక్కుంటూ ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. కరోనా కరువు పరిస్థితుల్లో భారమైన బతుకు బండిని.. ఉపాయంతో ముందుకు లాగుతున్నారు. అందరిదీ ఒ‍కటే ఆశ... ఒకటే మాట... కరోనా మహమ్మారి..అంతమవుతుందని. మళ్లీ మంచి రోజులొస్తాయని నమ్ముతున్నారు. అప్పటివరుక ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా బతకాలని బతుకు పాఠాలు చెప్తున్నారు.

ఇదీ చదవండి :శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరదపోటు.. 36 గేట్లు ఎత్తివేత

ABOUT THE AUTHOR

...view details