Minister Errabelli on Governor comments: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహార శైలిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఈ రోజు రాజ్భవన్లో గవర్నర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాష్ట్రంలో గవర్నర్ తమిళిసై హుందా తనాన్ని కోల్పోతున్నారన్నారు. గవర్నర్ వ్యవస్థను కించపరిచే చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గవర్నర్గా ఆమె చర్యలు ప్రజలను బాధపెడుతున్నాయని పేర్కొన్నారు. తమిళిసై సౌందరరాజన్ తెలంగాణలో భాజపా కార్యకర్తలా వ్యవహరిస్తూ.. ఈ పార్టీ నాయకులతో సమావేశాలు, చర్చలు జరపడం సరైన విధానం కాదని వ్యాఖ్యానించారు. గవర్నర్ వ్యవస్థను కించపరచడం వల్లే తమిళిసైకి తగిన గౌరవం దక్కడం లేదని ప్రస్తావించారు. గవర్నర్ హుందాగా వ్యవహరిస్తేనే ఆమెకు ఇచ్చే గౌరవం ఎప్పటికీ ఉంటుందని మంత్రి వ్యాఖ్యానించారు.
'భాజపా కార్యకర్తలతో తమిళిసై సమావేశాలు పెట్టడం సరైన విధానం కాదు. గవర్నర్ వ్యవస్థను కించపరిచే చర్యలకు పాల్పడుతున్నారు. గతంలో వచ్చిన గవర్నర్లు ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడిన సంఘటనలు ఉన్నాయా?. మేడారం వచ్చే సమాచారం స్థానిక మంత్రిగా కనీసం నాకు ఇవ్వలేదు. దయచేసి హుందాగా ప్రవర్తించాలని గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. గవర్నర్ తమిళిసైని తెలంగాణ ఆడపడుచులా చూసుకున్నాం.'- ఎర్రబెల్లి దయాకర్రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి