భారీ వర్షాలతో ఇప్పటికే అతలాకుతలమైన వరంగల్ ఉమ్మడి జిల్లా ఇంకా తెరుకోకముందే.. మళ్లీ విస్తారంగా వానలు పడుతున్నాయి. వాగులూ వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు సామర్థ్యానికి మించి ప్రవహిస్తూ.. రహదారులను ముంచేస్తున్నాయి.
రెండు రోజుల వ్యవధిలోనే వరుణుడు జోరు పెంచడంతో మరోసారి ఓరుగల్లు జలమయమైంది. సుమారు 10 సె.మీ వర్షపాతం నమోదయింది. రహదారులపైకి భారీగా వరదనీరు వచ్చిచేరింది. పలు కాలనీలు నీటమునిగాయి.
హంటర్ రోడ్.. ఎన్టీఆర్ నగర్, బృందావన కాలనీ, సాయినగర్, సంతోషిమాత కాలనీ, గిరిప్రసాద్ నగర్, రామన్నపేట ప్రియదర్శిని కాలనీ, రఘునాథ్ కాలనీ, భద్రాకాళీ రోడ్, శివనగర్, మైసయ్యనగర్, ఎనుమాముల లక్ష్మీగణపతి కాలనీ, మధురానగర్, టీవీ టవర్ కాలనీ, అమరావతి నగర్, వికాస్ నగర్ కాలనీల చుట్టూ వరదనీరు వచ్చి చేరింది. బొందివాగు, పెద్దమ్మగడ్డ నాలాలు పొంగి పొర్లడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన జేసీబీతో మట్టి, చెత్త తీసి....వరదనీరు త్వరగా పారేందుకు కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకున్నారు.
నగరంలో 20 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి.. 7,500 మందికి భోజన వసతి కల్పించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వరద ప్రాంతాల్లో పర్యటించి....సహాయక చర్యలను పర్యవేక్షించారు. 800 మందిని విపత్తు నిర్వహణ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అక్షయపాత్ర తయారుచేసిన ఆహార పొట్లాలను బాధితులకు పంపిణీ చేశారు.
వరంగల్ గ్రామీణ జిల్లా..
కుండపోత వర్షాలకు....వరంగల్ గ్రామీణ జిల్లా వణుకుతోంది. పట్టణ శివార్లలోని కోనారెడ్డి చెరువు కట్ట తెగిపోయింది. ఒక్కసారిగా అందరూ భయాందోళనలకు లోనైయ్యారు. వర్ధన్నపేట పట్టణంలోని కోనాపురం, ఎస్సీ కాలనీ, వంశరాజ్ నగర్, యాదవ కాలనీలను వరదనీరు ముంచెత్తింది. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, జిల్లా కలెక్టర్ హరిత, స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్... ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొత్తపల్లి, ల్యాబర్తి గ్రామాల్లోని ప్రజలు.. వరంగల్లోని బంధువుల ఇళ్లకు క్యూకట్టారు. అటు వందలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. రాయపర్తి, సంగెం, పర్వతగిరి, మండలాల్లోనూ చెరువులు, కుంటలు పొంగి ప్రవహిస్తున్నాయి.