తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆసరా అయోమయం, మండలానికి 48 కార్డులే సరఫరా - అర్హుల జాబితాలు రాకపోవడంతో సందిగ్ధం

New Pensions in Telangana స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వం 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. ప్రతి మండలానికి కేవలం 48 కార్డులు మాత్రమే వచ్చాయి. వాటిని కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయడం లేదు. అర్హుల జాబితాలు రాకపోవడంతో కొత్త ఆసరా పింఛన్లపై సందిగ్ధం నెలకొంది.

New Pensions
New Pensions

By

Published : Aug 21, 2022, 6:45 AM IST

New Pensions in Telangana: కొత్త ఆసరా పింఛన్లపై అయోమయం నెలకొంది. లబ్ధిదారుల పూర్తి జాబితా జిల్లాకు చేరకపోవడంతో ఎవరికి వచ్చాయో లేదో తెలియడం లేదు. ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి కొత్త ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 30,717 మంది లబ్ధిదారులకు మంజూరు చేస్తామని అధికారులు ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కొందరికి కొత్త కార్డులు పంపిణీ చేశారు. ప్రతి మండలానికి కేవలం 48 కార్డులు మాత్రమే వచ్చాయి. వాటిని కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయడం లేదు. మిగతావి వచ్చిన తర్వాత అందించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

వయస్సు తగ్గించిన వారివే అధికం..

*జిల్లాలో ప్రస్తుతం అన్ని విభాగాల్లో కలిపి 1.46 లక్షల ఆసరా పింఛన్లు ఇస్తున్నారు.

*కొత్తగా 30,717 మందికి మంజూరు చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో వయస్సు తగ్గించిన వారి పింఛన్లే అధికంగా ఉన్నాయి.

*57 సంవత్సరాల వయస్సు కలిగిన వారు జిల్లావ్యాప్తంగా 27 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.

*ఇందులో 17,182 మందికి మాత్రమే మంజూరయ్యాయి. మిగతా 10 వేల దరఖాస్తుదారులు అర్హులో కాదో చెప్పడం లేదు.

*ముందుగా ఐకేపీ సిబ్బంది సర్వే చేయగా జిల్లావ్యాప్తంగా 18వేల మంది అర్హులున్నట్లుగా తేలింది. తర్వాత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా 26 వేల మంది చేసుకున్నారు.

*తర్వాత దరఖాస్తుల గడువు పొడిగించగా మరో వెయ్యికి పైగా దరఖాస్తులు అందాయి.

మళ్లీ అవకాశం..ఆసరా పింఛన్ల కోసం అర్హులు మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే పూర్తి జాబితా వస్తేనే అందులో వారి పేరు ఉందో లేదో తెలుస్తుంది. పేరు లేకుంటే తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు. జాబితాల కోసం ఆయా ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకా రాలేదని అధికారులు చెబుతున్నారు. మరికొందరు కలెక్టరేట్‌కు వచ్చి ఆరా తీస్తున్నారు. ఒక్కో మండలానికి పంపిన 48 కార్డులను ఎమ్మెల్యేలతో పంపిణీ చేయించాలని మొదట భావించారు. కొందరికే అందిస్తే మిగతా వారు ఆందోళన చేస్తారేమోననే అనుమానంతో పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

సర్వేనే చేయలేదు..కొత్త ఆసరా పింఛన్లలో వయస్సు తగ్గించిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహించలేదు. రాష్ట్రస్థాయిలో వివిధ సాఫ్ట్‌వేర్ల సాయంతో దరఖాస్తులను వడబోసి అర్హులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కారు, బైక్‌, భూమి, ఆదాయ పన్ను కట్టేవారు, కుటుంబంలో ఉద్యోగి ఉండటం వంటి వివరాలతో అనర్హులను తేల్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇతర విభాగాలకు సంబంధించి మాత్రం సర్వే చేపట్టారు.

త్వరలో వస్తాయి..జిల్లాలో కొత్తగా 30,717 ఆసరా పింఛన్లు మంజూరయ్యాయి. ముందుగా మండలానికి 48 కార్డుల చొప్పున పంపించారు. మిగతావి త్వరలో వస్తాయి. - సాయన్న, డీఆర్డీవో, కామారెడ్డి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details