తెలంగాణ

telangana

ETV Bharat / city

మార్కెట్ ఛైర్మన్ పదవి కోసం.. ముగ్గురు ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు.. - నిజామాబాద్‌ మార్కెట్‌ తాజా సమాచారం

ఒక్క నామినేటేడ్‌ పదవి కోసం ముగ్గురు ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. నిజామాబాద్ మార్కెట్ ఛైర్మన్ పదవిని అనుచరులకు ఇప్పించేందుకు మూడు నియోజకవర్గ ఎమ్మెల్యేలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల ఒత్తిడితో నాలుగేళ్లుగా మార్కెట్ కమిటీ పాలకవర్గం... నియామకానికి నోచుకోవడం లేదు. ఒకరికిస్తే మరొకరు నొచ్చుకుంటారని... అధిష్ఠానం కాలయాపన చేస్తోందని స్థానిక నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యపోరుపై పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Nizamabad market
Nizamabad market

By

Published : Sep 28, 2022, 11:44 AM IST

మార్కెట్ ఛైర్మన్ పదవి కోసం.. ముగ్గురు ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు..

నిజామాబాద్ జిల్లాలో నామినేటెడ్ పదవులు... ముగ్గురు ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య ధోరణికి కారణమైంది. తమ నియోజకవర్గానికి చెందిన అనుచరుడికి పదవి ఇప్పించేందుకు ఎమ్మెల్యేలు... పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్రస్దాయిలో నిజామాబాద్‌ మార్కెట్‌కు గుర్తింపు ఉండటం, నాలుగు నియోజకవర్గాల పరిధిలో కార్యకలాపాలు కొనసాగుతుండటంతో ఆ పదవి తన అనుచరులకే దక్కేలా చేసేందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్ధ ఛైర్మన్ పదవిని... ఆర్మూర్ నియోజకవర్గానికి కేటాయించారు. నూడా ఛైర్మన్ పదవిని అర్బన్ నియోజకవర్గానికి ఇచ్చారు. అర్బన్ పరిధిలో ఉన్న నిజామాబాద్ మార్కెట్ ఛైర్మన్ పదవిని... గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్ తమ నియోజకవర్గానికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అర్బన్ పరిధిలో మార్కెట్ కమిటీ ఉండటంతో... అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా సైతం తన అనుచరులకే దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారని... ప్రచారం సాగుతోంది. కీలకమైన ఆ పదవి కోసం.. ఎమ్మెల్సీ కవితను ఒప్పించ్చే ప్రయత్నం చేస్తున్నారని పార్టీవర్గాల్లో చర్చజరుగుతోంది.

నాలుగేళ్లుగా ఇందూరు మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ఖాళీగా ఉంది. ఐతే ఈసారి దసరా లోగా లేదంటే ఆతర్వాత మార్కెట్ కమిటీకి కొత్త పాలకవర్గాన్ని భర్తీ చేసే ఆలోచనలో... సర్కారు ఉందని నేతలు చెబుతున్నారు. గ్రామీణ నియోజకవర్గానికి మార్కెట్ పదవి కట్టబెట్టాలని గులాబీ పార్టీ భావిస్తుంటే... అర్బన్, బోధన్ ఎమ్మెల్యేలు నసేమిరా అంటున్నారని సమాచారం. గతంలో చైర్మన్ పదవి... గ్రామీణ ఎమ్మెల్యే మనిషికి దక్కడంతో.. ఈసారి బోధన్ నియోజవర్గానికి ఇవ్వాలని షకీల్ గట్టిగా అడుగుతున్నారు. ఉద్యమకారులు సైతం ఆ పదవి కావాలని ఎమ్మెల్సీ కవిత చుట్టు తిరుగుతున్నారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

నిజామాబాద్ మార్కెట్ కమిటీ నియామకంలో ఎమ్మెల్యేలు చెప్పిన వారికి పదవి కట్టబెడతారా లేకపోతే నేరుగా అధిష్ఠానం పెద్దలే నిర్ణయిస్తారా అన్న సందిగ్ధం నెలకొంది. ఐతే ఏ వర్గానికి పదవి దక్కినా మిగతా వారికి తమ అనుచరులతో ఇబ్బందులు తప్పేలా లేవన్న చర్చ పార్టీలో సాగుతోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details