ఎన్నికల సంఘం బృందం నిజామాబాద్లో పర్యటించింది. హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్ చేరుకున్న ఈసీ సభ్యులకు జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు స్వాగతం పలికారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్, అదనపు సీఈవో జ్యోతి బుద్ధ ప్రకాశ్, సంయుక్త సీఈవో రవి కిరణ్, అడిషనల్ డీజీ జితేందర్, ప్రత్యేక అధికారి రాహుల్ బొజ్జా, పరీశీలకులు గౌరవ్ దాలియాలు ఉదయం నిజామాబాద్ చేరుకున్నారు.
పార్టీల ప్రతినిధులు, రైతులతో సమావేశం
పర్యటనలో భాగంగా మొదట పాలిటెక్నిక్ కళాశాలలో పీవో, ఏపీవోలకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం రైతులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రచారానికి మరింత సమయం కావాలని రైతులు కోరినట్లు రజత్ తెలిపారు. పోలింగ్ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారన్నారు. రైతుల డిమాండ్‌లను కేంద్ర ఎన్నికల సంఘానికి వివరిస్తానని తెలిపారు. ఈనెల 11న పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.