తెలంగాణ

telangana

ETV Bharat / city

శరవేగంగా రైతు వేదికలు... ఆనందంలో అన్నదాతలు - నిజామాబాద్​ తాజా వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతు వేదికల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే దాదాపు పూర్తై.. అన్ని జిల్లాల కంటే ముందు ఎక్కువ రైతు వేదికలు నిర్మించి.. రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. పంటలు, తెగుళ్లు, దిగుబడులు, పెట్టుబడులు, మద్ధతు ధర, సందేహాలు, నిపుణుల సలహాలు.. వంటి సకల అంశాలను చర్చించుకోవడానికి రైతులకు మంచి వేదిక లభించనుంది. ఇప్పటికే.. కామారెడ్డి జిల్లాలో 104 రైతు వేదికలు దాదాపు పూర్తి కాగా.. నిజామాబాద్​లో 106 వేదికలు నిర్మాణ దశలో ఉన్నాయి.

Raithu Vedika Construction Works Moving Faster  in nizamabad
పూర్తి కావొస్తున్న రైతు వేదికలు.. హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

By

Published : Oct 8, 2020, 1:27 PM IST

ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసిన రైతులు.. అన్ని అంశాల్లో నిరాదరణకు గురవుతున్నారు. సరైన మార్కెటింగ్, పంట వేసే సమయంలో సలహాలు, సూచనలు లేక నష్టపోతున్నారు. అధునాతన వ్యవసాయ సమాచారం అందుకోవడంలో కూడా వెనుకబడిపోయి.. సంప్రదాయ మూస పద్ధతిలోనే సాగు చేసుకోవాల్సి వస్తోంది. అయితే రైతులందరూ ఒకచోట కలిస్తే.. అనేక అంశాలు చర్చకు వస్తాయి. నూతన సాగు పద్ధతులు, యంత్రీకరణ, సాంకేతికత, పంటలో మెళకువలు, అధిక దిగుబడులు, మేలు రకం విత్తనాల గురించే మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సమాచారం పంచుకోవడమే గాక.. వారే స్వయంగా చాలా విషయాలు తెలుసుకుంటారు. ఈ కోణంలో ఆలోచించి తెలంగాణ ప్రభుత్వం అమలు చేసినదే.. రైతు వేదిక. దాదాపు అన్ని జిల్లాల్లో పూర్తి కావొస్తున్న రైతు వేదికల నిర్మాణాలు రైతులకు ఉపయోగపడే అంశం కానుంది.

పూర్తి కావొస్తున్న రైతు వేదికలు.. హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

కామారెడ్డిలో సిద్ధం... నిజామాబాద్​లో ఆలస్యం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్​ జిల్లాకు 106, కామారెడ్డి జిల్లాకు 104 రైతు వేదికలను మంజూరు చేసింది. నిజామాబాద్ జిల్లాలో 106 రైతు వేదికలకు గానూ ఇప్పటి వరకు 11 పూర్తయ్యాయి. 35 రైతు వేదికలు చివరి దశలో ఉండగా.. రూఫ్ స్థాయిలో 25, బేస్ మెంట్ స్థాయిలో 35 ఉన్నాయి. మోపాల్, జాడి జమాల్ పూర్, సాలూర, రాంపూర్, కొత్తపల్లి, రుద్రూర్, పాలెం, వడ్యట్, చౌట్ పల్లి, వేల్పూర్, మెంట్రాజ్ పల్లి క్లస్టర్ల రైతు వేదికలు పూర్తయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 104 రైతు వేదికలకు మొత్తం 104 పూర్తయ్యాయి. కొన్ని రైతు వేదికల్లో మాత్రం మొక్కలు నాటడం వంటి చిన్న చిన్న పనులు సాగుతున్నాయి. రైతు వేదికల నిర్మాణాల్లో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ మేరకు జిల్లాలో రైతు వేదిక నిర్మాణ పనులపై ఓ ఫొటో ఆల్బమ్ తయారు చేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించనున్నారు.

యాసంగి లోపు అందేలా..

రాష్ట్రంలో మొత్తం 2604 రైతు వేదికల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే వాటికి అవసరమైన స్థలాలను గుర్తించి నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు. వ్యవసాయ విస్తరణ అధికారి పరిధిలో ఉన్న గ్రామాలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి.. ప్రతి క్లస్టర్​కు ఒక రైతు వేదికను మంజూరు చేశారు. ఒక్కో రైతు వేదికకు 2,046 చదరపు అడుగుల స్థలంలో.. రూ.22లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు. రూ.11 లక్షలు ఉపాధిహామీ కింద, రూ.11లక్షలు రాష్ట్రప్రభుత్వం నిధులు కేటాయించారు. సకల సౌకర్యాలతో.. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యాధునికంగా రైతు వేదికలను నిర్మిస్తున్నారు. ఒకేసారి 150 మంది రైతులు కూర్చుని సమావేశం నిర్వహించుకునేలా హాలు, వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం, రెండు గదులు, ఒక టాయిలెట్ నిర్మిస్తున్నారు. రెండు గదుల్లో ఒకటి వ్యవసాయ విస్తరణ అధికారికి కేటాయించగా.. మరొకటి రైతు బంధు సమితికి కేటాయించారు. ఇక్కడే రైతులకు నూతన వ్యవసాయ విధానాలు, మార్కెటింగ్ నైపుణ్యాలపై రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ యాసంగి లోపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతు వేదికల నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి వచ్చేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వ్యవసాయ రంగంలో ముందడుగు..

గ్రామీణ వాతావరణం ఉట్టి పడేలా.. వ్యవసాయ క్షేత్రాన్ని తలపించేలా అధికారులు రైతు వేదికల నిర్మాణాలు ఉండేలా డిజైన్​ చేశారు. రైతు వేదికకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా, రైతు వేదిక ముందు, చుట్టు పక్కల అంలకరణ చెట్లు నాటుతున్నారు. ప్రతి రైతు వేదికకు మిషన్ భగీరథ కనెక్షన్, విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు. రైతులు, వ్యవసాయాన్ని ప్రతిబింబించేలా రైతు వేదిక గోడల మీద చిత్రాలు గీస్తున్నారు. వీటి ద్వారా నూతన వ్యవసాయ, సాంకేతిక, మార్కెటింగ్ అంశాలు రైతులకు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా అధిక దిగుబడుల సాధనకు రైతులకు వీలు కలుగుతుంది. రైతు వేదికల నిర్మాణం తెలంగాణ వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మకమైన ముందడుగుగా నిలిచిపోతుంది.

ఇదీ చూడండి:ఆటో నెంబర్​ కారుకు అతికించారు.. పోలీసులు గుర్తు పట్టేశారు!

ABOUT THE AUTHOR

...view details