తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో జరుగుతున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడుగంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.... రాత్రిఏడుగంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 53.3 శాతం ఓటింగ్ నమోదైంది.
ఈవీఎంల మొరాయింపు..
తిరుమలగిరి సాగర్ మండలం తూటిపేట తండాలో ఈవీఎంల మొరాయింపుతో... పోలింగ్ అరగంట ఆలస్యంగా మొదలైంది. గుర్రంపోడు మండలం వట్టికోడులోని 13, త్రిపురారంలోని 265 పోలింగ్ కేంద్రాల్లోనూ ఈవీఎంలు మొరాయించాయి. నాగార్జునసాగర్ హిల్ కాలనీ పోలింగ్ కేంద్రం 100లో ఏజెంట్లు ఆలస్యంగా రావడంతో ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఓటు వేసే ప్రతి ఒక్కరికి గ్లవ్స్‌తో పాటు పోలింగ్ గదిలో శానిటైజర్ అందుబాటులో ఉంచారు. భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
పరస్పర ఆరోపణలు..
త్రిపురారంలోని 265 బూత్‌లో... 20 నిమిషాలు ఆలస్యమైంది. ఏజెంట్లు సమయానికి రాలేదని అధికారులు... సిబ్బంది సీళ్లు తెరవకపోవడం వల్లే పోలింగ్‌లో జాప్యం నెలకొందని ఏజెంట్లు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మాడుగులపల్లి మండలం అభంగాపురంలోనూ ఈవీఎంలలో సాంకేతిక సమస్య ఏర్పడింది. తిరుమలగిరి సాగర్ మండలం తూటిపేట తండాలో ఈవీఎం మొరాయించడం వల్ల... అరగంట ఆలస్యంగా ఓటింగ్ మొదలైంది. ఓటింగ్ యంత్రాల్లో సమస్యల వల్ల ప్రజలు... ఉదయం నుంచి పడిగాపులు పడాల్సి వచ్చింది.
1 గంట వరకు 53.3% ఓటింగ్
ఉదయం తొమ్మిదింటి వరకు 12.9 శాతంగా ఉన్న పోలింగ్... 11 గంటల వరకు 31 శాతానికి చేరుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 53.3 శాతం నమోదైంది.