Bandi Sanjay padayatra: బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా ఈ రోజు ఆలేరు నియోజకవర్గంలోని గుండాల మండల కేంద్రానికి చేరుకున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఆ పార్టీ శ్రేణులు బతుకమ్మలు, బోనాలు, డప్పు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. వివిధ వర్గాల ప్రజలతో మమేకమై, వారి సమస్యలు, ఆర్థిక పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గుండాల మండలంలోని తుర్కలషాపూర్ గ్రామస్థులతో బండి సంజయ్ సమావేశం అయ్యారు. ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి సర్పంచ్‌లకు వచ్చిందంటూ... బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. నిధులు అడిగిన సర్పంచ్‌లను.. చంపేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకుంటున్నారని బండి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీల పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉందని ఆరోపించారు. కొద్దో గొప్పో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి కేంద్రం ఇచ్చిన నిధులతోనే అయ్యిందని అన్నారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా తయారయ్యిందని సంజయ్ మండిపడ్డారు. అధికారపక్షం వాళ్లు ఉపఎన్నికలు కోరుకుంటున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.