తెలంగాణ

telangana

ETV Bharat / city

స్వయంభూ లక్ష్మీ నర్సింహ స్వామి భూముల కబ్జా

భూరికార్డుల ప్రక్షాళన, రైతుబంధు, రైతు బీమా పథకాల అమలు నేపథ్యంలో తెలంగాణలో  భూములకు గిరాకీ బాగా పెరిగిపోయింది. దీని వల్ల ప్రజలే కాదు...ప్రభుత్వ శాఖలు సైతం అప్రమత్తమయ్యాయి. దస్త్రాలు అన్నీ సరిగా  ఉన్నాయో? లేవో అని చూసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే షాద్​నగర్ నియోజకవర్గంలో కొందుర్గు లక్ష్మీ నర్సింహ స్వామి దేవాలయ భూములు అన్యాక్రాంతమైన విషయం తెలిసింది.  ఆ భూముల్లో ఏకంగా కాలనీలే వెలిశాయి. ఇప్పుడు వాటిని కాపాడుకునే పనిలో నిమగ్నమైంది  దేవాదాయశాఖ.

స్వయంభూ లక్ష్మీ నర్సింహ స్వామి భూముల కబ్జా

By

Published : May 9, 2019, 11:59 PM IST

స్వయంభూ లక్ష్మీ నర్సింహ స్వామి భూముల కబ్జా

భూరికార్డుల ప్రక్షాళన నేపథ్యంలో కొందుర్గు మండల కేంద్రంలోని స్వయంభూ లక్ష్మీ నర్సింహ స్వామి దేవాలయ భూములు అన్యాక్రాంతమైన విషయం వెలుగులోకి వచ్చింది. 11వ శతాబ్దంలో బాదామీ చాళుక్యులు ఈ పురాతన ఆలయాన్ని నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. పాత ఆలయం చుట్టూ పెండ్యాల అనే గ్రామం విస్తరించి ఉంది. అది క్రమ క్రమంగా కనుమరుగైంది.
ఉత్సవ శోభ అలాగే ఉండాలని...
దసరా పర్వదినం సందర్భంగా ఒకప్పుడు ఈ ఆలయం కేంద్రంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగేవి. 365 రోజులు ఆలయంలో ఉత్సవ శోభ అలాగే ఉండాలన్న ఉద్దేశంతో 365 ఎకరాలను రాజులు ఈ ఆలయానికి కేటాయించారని అప్పటి పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం 312 ఎకరాలు మాత్రమే దేవాదాయశాఖ భూములుగా రికార్డులు చెబుతున్నాయి. మిగిలిన భూములు రికార్డుల్లో లేవు. ఉన్న భూముల్లోనూ సుమారు 15 ఎకరాల్లో ఏకంగా కాలనీ వెలిసింది. ఇంకో 10 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములను రైతులు అక్రమించి సాగు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు నిర్ధరణకు వచ్చారు. రైతులు కౌలు సైతం చెల్లించడం లేదని గుర్తించారు.
అప్రమత్తమైన అధికారులు
ఆక్రమణలపై ఆలస్యంగా మేల్కొన్న దేవాదాయ శాఖ ఇటీవలే తమ భూముల్లో వెలసిన కాలనీ వాసులకు నోటిసులు జారీ చేశారు. అలాగే భూముల్ని సాగు చేసుకుంటూ కౌలు చెల్లించని వారిపైనా చర్యలకు సిద్ధమయ్యారు.
తాత ముత్తాతల నుంచి ఇక్కడే ఉంటున్నాం..
వందేళ్ల కిందటే తమ పూర్వీకుల నుంచి ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకుని ఉంటున్నామని కాలనీ వాసులు తెలిపారు. అవి దేవాదాయ శాఖ భూములని తమకు తెలియదంటున్నారు. తమను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయడం ఎంత వరకు సబబని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఆ కేసు దేవాదాయశాఖ ట్రిబ్యునల్ విచారణలో ఉంది.
ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి అక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే 365 ఎకరాల్లో మిగిలిన భూములు సైతం ఎక్కడున్నాయో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details